మూలన పెట్టేశారు..! | - | Sakshi
Sakshi News home page

మూలన పెట్టేశారు..!

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

అధ్యక్షుడిగా చేసిన సీనియర్‌కు ఉపాధ్యక్ష పదవి మంత్రి‘కళ’ లేనట్టేనా?

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

న్టీయార్‌తో కలిసి భోజనం చేశాను.. ఆ రోజుల్లో ఆయనపక్కనే మనకు ప్రత్యేకంగా కుర్చీ ఉండేది.. ఏంటి బ్రదర్‌ అనేవారు.. అదీ మన రేంజి అంటూ క్యాడర్‌ వద్ద తరచూ చరిత్ర చిట్టావిప్పే సీనియర్‌ను టీడీపీ అధిష్టానం మూలనపెట్టేసింది. కలెక్టర్‌గా చేసిన అధికారిని బిల్లు కలెక్టర్‌గా వేసినట్లు.. మేనేజర్‌గా చేసిన పెద్దాయన్ను బంట్రోతుగా మార్చినట్లు.. అప్పుడెప్పుడో మంత్రి పదవులు, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేసేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావును తాజా రాష్ట్ర కమిటీలో ఉంచీ ఉంచనట్లుగా ఉంచారు. ఉందో లేదో తెలియని రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో నియమించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

‘కళ’ తప్పింది...

వాస్తవానికి కళావెంకటరావును మొన్న కొత్తమావాస్యకు కేబినెట్లోకి తీసుకుంటాం అన్నట్లుగా ప్రచారం మొదలెట్టారు. అంతలోనే అమావాస్య అడ్డొచ్చిందో ఏమో కానీ అలాక్కాదు గానీ.. టీటీడీ చైర్మన్‌ ఇస్తారట అంటూ ఇంకో ఫీలర్‌ వదిలారు. తీరాచూస్తే పార్టీ పొలిట్‌ బ్యూరో నుంచి కూడా తొలగించి పార్టీ పరంగా ఎలాంటి అధికారాలు లేని రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ కళావేంకటరావు ఇప్పుడు కొత్త జనరేషన్‌ వ్యక్తి అయిన పల్లా శ్రీనివాసరావు సారథ్యంలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నమాట. నాల్రోజులు ఆగండ్రా మన రేంజి మారిపోతుంది అంటూ క్యాడర్‌ వద్ద చెబుతూ వస్తున్న పెద్దాయన... ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో.. ఎలా సమాధాన పరచాలో తెలియక సతమతమైపోతున్నారట.

మరోవైపు గజపతినగరం నియోజకవర్గానికి చెందిన శ్రీదేవిని పార్టీ పాలిట్‌ బ్యూరోలోకి తీసుకోవడం కళావెంకటరావుకు మరో షాకింగ్‌ అంశం. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌ ప్రస్తుతం మంత్రిగా ఉంటూ లోకేశ్‌ కనుసన్నల్లో మెలుగుతూ తన పదవిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక మండల స్థాయి మహిళను ఏకంగా పొలిట్‌ బ్యూరోలోకి తీసుకునేలా అధిష్టానాన్ని ప్రభావితం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్‌ మోస్ట్‌ కళావెంకటరావు కన్నా రాజకీయాల్లో ఫ్రెషర్‌ అయిన కొండపల్లి శ్రీనివాస్‌కే పార్టీలో పరపతి ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే పార్టీలో కళావెంకటరావు ప్రభ మసకబాటుతున్నట్లే అని క్యాడర్‌ సైతం అర్థం చేసుకుంటోంది. మున్ముందు ఇక ఆయనకు మంత్రి పదవి గట్రా మరి ఇచ్చేది ఉండకపోవచ్చని, అందుకే ఏదో పదవి పేరిట ఉపాధ్యక్ష పదవిని ఇచ్చేసి సరిపెట్టారన్న చర్చ పార్టీలో సాగుతోంది.

ఒకనాడు రాష్ట్ర స్థాయిలో కరప్రెత్తనం చేసిన కామందు వార్థక్యంలో కుక్కిమంచానికి పరిమితమైనట్లు.. ఒకనాడు ఊరందరినీ అదలించిన మునసబుగారి మునకాల కర్ర మూలకు చేరినట్లు కళా వైభవం కూడా మసకబారుతోందని అంటున్నారు. వాస్తవానికి కళా రాజకీయ భవిష్యత్తుపై గతంలోనే ‘సాక్షి’ ఓ కథనాన్ని వెలువరించగా దాన్ని పాఠకులు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ మున‘కళ’ కర్ర మొత్తానికి మూలకు చేరిందయితే అనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement