విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులకు హక్కుగా వచ్చే పదోన్నతుల అర్హత టెట్‌తో సంబంధం లేకుండా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ హోటల్‌లో సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టెట్‌తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు 57 అమలు చేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కోరారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
సరెండర్ లీవ్ మంజూరు చేయాలి
హైస్కూల్ ప్లస్‌లను బలోపేతం చేసి రెగ్యులర్ పద్ధతిలో పీజీటీలను నియమించాలని 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంటర్మ్ రీలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకూడదని 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ నియోజవర్గ కన్వీనర్, రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారు తమ్మినేని ఆనందరావు, రాష్ట్ర క్యాదర్శి ఇజ్జురోతు రామునాయుడు, ఎంపీ.శ్రీనివాసరావు, రాష్ట్రనాయకులు వీవీజేసుబ్రహ్మణ్యం, రమణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు శివరామప్రసాద్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, విశాఖ పట్నం జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు.
ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ


