పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలి: కేకే రాజు
మహారాణిపేట: రాష్ట్ర యువత భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. గురువారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన, విద్యార్థి విభాగాల సమావేశం జరిగింది. జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్ర రావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేకే రాజు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల పేరిట ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విఫలమవ్వడం, కొత్త పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, నాయకులు జగ్గుపల్లి నరేష్, ధీరజ్ రెడ్డి, హరీష్, చంద్రమౌళి, నాగిరెడ్డి కిరణ్, తాడి రవితేజ, రవికిరణ్ రెడ్డి, తులసి కుమార్, రోహిత్, నితిష్, రౌత్ శ్రీను, మీసాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


