శ్రీహరి అరెస్ట్ విషయంలో పోలీసుల తీరు అప్రజాస్వామికం: కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ వ్యవహారంలో న్యాయమే గెలిచిందని, కక్ష సాధింపులకు దిగుతున్న ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీహరి అరెస్ట్ తీరును, పోలీసుల అత్యుత్సాహాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఇంటికి వెళ్తున్న శ్రీహరిని మార్గమధ్యలో మఫ్టీ పోలీసులు అడ్డగించి, ఏ స్టేషన్‌కు చెందిన వారో, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లారని కేకే రాజు ఆరోపించారు. ఆయన ఫోన్, ల్యాప్‌టాప్‌ను దౌర్జన్యంగా లాక్కున్నారని మండిపడ్డారు. శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్పకుండా, ఆయన నివాసంలోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి సోదాలు నిర్వహించడం దారుణమన్నారు. ఇంట్లోని సహాయకుడిని బెదిరించి బయటకు పంపడం, సోదాల సమయంలో ఎవరినీ లోపలికి అనుమతించకపోవడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన పోలీసు అధికారులను తమ ప్రభుత్వం రాగానే చట్టం ముందు నిలబెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోందని.. పాలనను గాలికొదిలేసిందని, కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని కేకే రాజు ధ్వజమెత్తారు.


