
నాణెం.. చరిత్రకు సాక్ష్యం
తగరపువలస: జీవీఎంసీ ఒకటో వార్డు చిట్టివలసకు చెందిన రంగూరి గిరిధర్ ఇంట కాలచక్రంలో కరిగిపోని ఓ అపురూప నిధి ఉంది. అది బంగారం, వజ్రాలు కాదు.. వందలాది పాతకాలపు నాణేలు, పదుల సంఖ్యలో అప్పటి కరెన్సీ నోట్లు! అవును.. ఇవి చరిత్రకు సజీవ సాక్షాలు. గిరిధర్ వద్ద భద్రంగా ఉన్న ఈ నాణేలన్నీ ఒకప్పటి మన జీవన విధానానికి, ఆర్థిక వ్యవస్థకు అద్దం పడతాయి. వీటిలో అణా, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇరవై, ఇరవై ఐదు, యాభై పైసల నాణేలున్నాయి. ఆనాటి అవసరాలకు అనుగుణంగా అల్యూమినియం, ఇత్తడి, కంచు వంటి లోహాలతో తయారైన ఈ నాణేలు చూడటానికి చిన్నవే అయినా.. అవి మోసుకొచ్చిన చరిత్ర ఆసక్తికరం. ఈ నాణేలు ఇప్పుడు చలామణిలో లేకపోవచ్చు. కానీ వాటి విలువ ఏమాత్రం తగ్గలేదని గిరిధర్ చెబుతున్నారు. నిజమే.. వీటి చారిత్రక, సాంస్కృతిక విలువ వెలకట్టలేనిది. పూర్వం చాలా మంది ఇలాంటి పాత నాణేలను ఇచ్చి వెండి వస్తువులు కొనుగోలు చేసేవారని, ఆ లెక్కన చూసుకున్నా ఇప్పటికీ ఈ లోహపు నాణేలకు విలువ ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ గిరిధర్ కుటుంబానికి మాత్రం ఈ నాణేలను అలా మార్చుకోవడం ఇష్టం లేదు. వీటిని చూస్తూ మురిసిపోతుంటుంది.
నాణేల వెనుక కథలు..
ఈ నాణేల వెనుక ఉన్న కథలను, అప్పటి వాటి కొనుగోలు శక్తిని తన తల్లిదండ్రులు అరుణకుమారి, ప్రసాదరావు వివరిస్తుండేవారని గిరిధర్ చెబుతున్నారు. ఒక అణాతో ఏమేమి కొనుగోల చేశాం? ఒక పైసా విలువ ఎలా ఉండేది? వంటి విషయాలు వారి మాటల్లో వింటుంటే ఆ కాలంలోకే వెళ్లినట్టు అనిపించేదని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు గిరిధర్ కూడా తన తర్వాతి తరాలకు ఈ నాణేలను చూపిస్తూ.. వాటి గొప్పతనాన్ని, మన పూర్వీకుల జీవన విధానాన్ని వివరిస్తున్నారు. ఈ నాణేల చప్పుడులో ఒకప్పటి చరిత్ర ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
నాన్న జ్ఞాపకం ఈ నాణేలు
మా నాన్న ప్రసాదరావు భీమిలి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్. ఆయనకు స్వదేశీ, విదేశీ నాణేలు సేకరించడం హాబీగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం, రాజుల పాలనతో నాణేలు కూడా ఉండేవి. పదేళ్ల కిందట ఆయన మరణించడం, ఇల్లు మారడంలో చాలా వరకు నాణేలు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు ఉన్న విలువైన వీటిని పదిలం చేసుకున్నాం.
– రంగూరి గిరిధర్, చిట్టివలస

నాణెం.. చరిత్రకు సాక్ష్యం

నాణెం.. చరిత్రకు సాక్ష్యం

నాణెం.. చరిత్రకు సాక్ష్యం

నాణెం.. చరిత్రకు సాక్ష్యం