
విశాఖ గడ్డ
దోపిడీదారుల అడ్డా..
కూటమి ప్రభుత్వంలో క్రైమ్ క్యాపిటల్‌గా మారిన జిల్లా
● నగరంలో వరుస దారి దోపిడీ ఘటనలు ● పట్టపగలే ప్రజలు,పర్యాటకులపై కర్రలు, కత్తులతో దాడులు ● ఐదు నెలల్లో ఆరు ఘటనలతో భయాందోళనలో ప్రజలు ● అడ్డూ అదుపు లేకుండా దొంగతనాలతో బెంబేలు
విశాఖ సిటీ:
● బీచ్ రోడ్డులో దోపిడీ దొంగలు ఇద్దరు పర్యాటకులపై బీరు సీసాలతో దాడి చేశారు. వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు ఎత్తుపోయారు.
● పెందుర్తిలో జీవీఎంసీ పంప్ ఆపరేటర్‌పై కత్తులతో తెగబడ్డారు. రెండు చేతులు కోసి రూ.10 వేలు అపహరించుకుపోయారు.
● కంచరపాలెంలో ఆటోలో కూర్చున్న వ్యక్తిని బెదిరించి డబ్బు కాజేసి పరారయ్యారు.
ఇలా.. దోపిడీదారులకు విశాఖ అడ్డాగా మారిపోయింది. ప్రశాంత నగరం కాస్తా.. క్రైమ్ క్యాపిటల్‌గా తయారవుతోంది. విజిబుల్ పోలీసింగ్ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీ నేరాలకు కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. నగరంలో వరుస దోపిడీ ఘటనలే ఇందుకు నిదర్శనం. గత ఐదు నెలల కాలంలో ఆరు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయాల్లోనే కాకుండా పట్టపగలు.. నగర నడిబొడ్డున కూడా దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. కత్తులు, కర్రలతో బెదిరిస్తూ ప్రజలతో పాటు పర్యటకులను సైతం నిలువు దోపిడీ చేస్తున్నారు.
నగరంలోనూ దోపిడీలు
నగరంలో చోరీలు, రోడ్డు ప్రమాదాలు, అత్యల్పంగా హత్యా ఘటనలు సాధారణంగా జరిగేవి. కానీ దోపిడీ ఘటనలు ఏడాదికి ఒకటి, రెండు మాత్రమే చోటుచేసుకునేవి. అదీ కూడా శివారు నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దోపిడీ దొంగలు చేలరేగిపోతున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. నగరంలో కూడా పెట్రేగిపోతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా కంచరపాలెంలో జరిగిన ఘటన నగరంలో పరిస్థితికి అద్దం పడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కంచరపాలెంలో పద్మశ్రీ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద వి.జీవన్‌కుమార్ ఆటోలో కూర్చొని ఉండగా.. ఇద్దరు అగంతకులు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఒకరు సెల్‌ఫోన్ ఇవ్వమని బెదిరించగా.. మరొకరు జీవన్‌కుమార్ జేబులో ఉన్న రూ.1,700 బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సాంకేతికత ఆధారంగా దోపిడీకి పాల్పడిన కంచరపాలెంకు చెందిన రౌడీషీటర్ అయిన దమరసింగ్ మోహన్ కన్నాను అరెస్టు చేశారు. మరో వ్యక్తి జాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం నగరంలో జరిగిన ఈ దోపిడీ ఘటన పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది. దొంగతనాలకు అయితే అడ్డూ అదుపు లేకుండా పోయింది.
కనిపించని విజిబుల్ పోలీసింగ్
శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో 24/7 నిఘా, విజిబుల్ పోలీసింగ్ కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైనట్లు ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. నగరంలో నేరాలు పెరిగిపోతున్నా.. పోలీసులు మాత్రం కేవలం ట్రాఫిక్ చలానాలు వేయడంలో బిజీగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత హడావుడిగా బృందాలు వేసి దర్యాప్తు చేయడం మినహా నేరాల నియంత్రణలో విఫలమవుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా కేసులను గోప్యంగా ఉంచుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దర్యాప్తు పేరుతో ఘటన జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ కేసు వివరాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కేసును ఛేదించిన తర్వాతే మాత్రమే మీడియా సమావేశాలు పెట్టి ఊదరగొట్టడం పరిపాటిగా మారింది. కేసు పరిష్కారం కాని పక్షంలో నేరం జరిగిందన్న విషయం కూడా తెలియకుండా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెలకో దోపిడీ ఘటన
స్టీల్‌ప్లాంట్‌లో 17 ఏళ్ల బాలుడు కూడా దారి దోపిడీకి పాల్పడడం గమనార్హం. గత నెల 10న స్టీల్‌ప్లాంట్ పరిధిలో ర్యాపిడో బుక్ చేసిన బైక్ ఎక్కిన మైనర్.. మార్గంమధ్యలో రైడర్ కిషోర్‌ను కొట్టి రూ.48,100 లాక్కొని పరారయ్యాడు.
పెందుర్తిలో ఫిబ్రవరి, మరో నెల వ్యవధిలో రెండు దారి దోపిడీలు జరిగాయి. 16వ తేదీన ఒక బాధితుడి నుంచి భారీగా నగదు, నగలు దోచుకున్నారు. అలాగే అంతకుముందు తెల్లవారుజామున 4.30 గంటలకు జీవీఎంసీ పంప్ ఆపరేటర్‌పై కత్తులతో దాడి చేసి, చేతులు కోసేసి రూ.10 వేలు కాజేశారు.
గతేడాది చివరలో బీచ్ రోడ్డులో పర్యాటకులపై దోపిడీదారులు బీరు సీసాలతో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు.
అంతకుముందే పాత డైరీ ఫారంలో జాతీయ రహదారిపైన రెండు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నాయి.