
మహిళపై లైన్‌మెన్ దురుసు ప్రవర్తన
రేణిగుంట : తన కూతురు గర్భిణిగా ఉండడంతో హాస్పటల్‌లో చూపించుకునే క్రమంలో విద్యుత్ బిల్లు చెల్లింపులో జాప్యం అయిందని లైన్‌మన్‌కు చెబుతుండగా వినకుండా విద్యుత్ స్తంభం ఎక్కి సరఫరాను నిలుపుదల చేశారు. మీరు ఇప్పుడు డబ్బులు చెల్లించినా రెండు రోజుల వరకు సరఫరా చెయ్యము మీకు దిక్కున చోట చెప్పుకోండి శ్రీఅంటూ దురుసుగా ప్రవర్తించిన సంఘటన రేణిగుంట మండలంలో చోటుచేసుకుంది.
రేణిగుంట మండలం గురవరాజుపల్లి పంచాయతీ, అంబేడ్కర్ కాలనీలో కనపర్తి సౌజన్య కొడుకు ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక లైన్‌మెన్ గోవిందరాజులు విద్యుత్ బిల్లు చెల్లించలేదని సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో నిండు గర్భిణి అయిన కూతురు, కొడుకుతో చిమ్మ చీకటిలో ప్రస్తుతం కాలం వెల్లదీస్తున్నారు. ఆన్‌లైన్‌లో 7 గంటలకు కరెంట్ బిల్లు చెల్లించామని, జేఎల్‌ఎంకు ఫోన్ చేయగా లైన్‌మన్ రెండు రోజుల వరకు కరెంటు ఇవ్వద్దని చెప్పాడని అన్నారు. ఉన్నతాధికారులు దయ ఉంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.