చి‘రాయి’వు

Telangana: Menhir From Iron Age Discovered At Ellarigudem - Sakshi

ఈ రాయి వయసు 3500 ఏళ్లు 

మరిపెడలో ఇనుపయుగం నాటి భారీ మెన్హిర్‌

సాక్షి, హైదరాబాద్‌: మూడున్నర వేల ఏళ్లకిందటి ఓ భారీ మెన్హిర్‌ వెలుగు చూసింది. ఆదిమ మానవులు చనిపోయిన తర్వాత సమాధి చేసే కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రముఖులెవరైనా చనిపోతే... వారి సమాధి వద్ద స్మృతిచిహ్నంగా భారీ నిలువు రాళ్లను పాతేవారు. ఆ నిలువు రాళ్లనే మెన్హిర్‌గా పేర్కొంటారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అలాంటి మెన్హిర్‌లు గతంలో వెలుగుచూశాయి.

స్థానికులకు వాటిమీద అవగాహన లేకపోవడంతో ఇవి అదృశ్యమయ్యాయి. కానీ మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బీచురాజుపల్లి గ్రామ శివారులో మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఓ మెన్హిర్‌ మానవ సామాజిక చరిత్రకు సాక్ష్యంగా భాసిల్లుతోంది. మరిపెడ–కురవి రహదారిపై ఉన్న ఈ నిలువురాయిని చరిత్ర పరిశోధకులు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్‌రావుతో కలిసి గుర్తించారు. మూడడుగుల మందంతో తొమ్మిది అడుగుల ఎత్తుందీ రాయి. అధికారులకు అవగాహన లేకపోవటంతో రోడ్డు నిర్మాణ సమయంలో పక్కనుంచి తీసిన మట్టిని ఈ నిలువురాయి మొదట్లో నింపారు. 

దీంతో మూడడుగులు భూమిలోకి కూరుకుపోయి, ఆరడుగుల రాయి మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు దాని వయసు దాదాపు మూడున్నర వేల సంవత్సరాలు. క్రీ.పూ.1500 సంవత్సరాల క్రితం ఇనుపయుగంలో ఏర్పాటు చేసిన ఈ అరుదైన మెన్హిర్‌ను కాపాడుకోవాలని, చరిత్ర పరిశోధనలో ఇవి కీలకమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. మానవుల మనుగడకు చిహ్నంగా మిగిలిన ఆ స్మారకశిల చుట్టూ కంచె ఏర్పాటు చేసి, దాని ప్రాధాన్యాన్ని తెలిపే బోర్డు పాతాలని ఆయన కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top