బ్లాక్‌ చైన్‌.. సేఫ్టీకి కీ చైన్‌

Telangana Government Focused On Increasing Blockchain Technology In Various Sectors - Sakshi

అన్ని రంగాల్లో కొత్త టెక్నాలజీ వాడకం పెంచేందుకు రాష్ట్ర సర్కారు దృష్టి 

ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందుకునేందుకు ప్రణాళిక 

రాష్ట్రంలో స్టార్టప్‌ల కోసం ఇప్పటికే ‘టీ బ్లాక్‌ యాక్సిలేటర్‌’ ఏర్పాటు 

తాజాగా దేశంలోని స్టార్టప్‌ల కోసం ఇండియా బ్లాక్‌చైన్‌ యాక్సలేటర్‌ మొదలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ రంగాల్లో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వాడకాన్ని పెంచేందుకు రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికత వినియోగం పెరుగుతుండటంతో మున్ముందు పెరిగే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక వేస్తోంది. తెలంగాణను ‘ప్రపంచ బ్లాక్‌చైన్‌ రాజధాని’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

ఇప్పటికే ‘తెలంగాణ బ్లాక్‌చైన్‌ డిస్ట్రిక్ట్‌’అనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా దేశంలోని స్టార్టప్‌లకు సాయం కోసం ‘ఇండియా బ్లాక్‌చైన్‌ యాక్సలేటర్‌’ను ప్రారంభించింది. దేశంలో బ్లాక్‌చైన్‌ స్టార్టప్‌ వాతావరణాన్ని పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సర్కారు చెప్పింది. 

ధరణి వెబ్‌సైట్‌ నుంచి మొదలు..  
‘ధరణి’వెబ్‌సైట్‌ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తోంది. భూ రికార్డుల్లో అనధికార లావాదేవీలు, దిద్దుబాట్లు జరగకుండా చూడటంతో పాటు భూ రికార్డులను శాశ్వతంగా భద్రపరిచేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. రాష్ట్రంలో రిజిస్టర్డ్‌ చిట్‌ఫండ్‌ సంస్థల ద్వారా ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో రూపొందించిన ‘టీ చిట్స్‌’మంచి ఫలితాలిస్తోంది.

మహిళా స్వయం సహాయక సంఘాల స్త్రీ నిధి లావాదేవీలకు క్రెడిట్‌ రేటింగ్‌ ఇచ్చేందుకు కాగ్నిటోచైన్‌ అనే స్టార్టప్‌ ‘బీ పోస్ట్‌’సేవలను తీసుకొచ్చింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఈ వివరాలను బీ పోస్ట్‌ పంచుకుంటుంది. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టేందుకు సర్టిఫికెట్ల జారీలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వాడుతోంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లను ఈ టెక్నాలజీ ద్వారానే ఇస్తున్నారు.  

మున్ముందు మరిన్ని రంగాలకు.. 
స్టార్టప్‌ రంగంలో రాబోయే తరంగా చెప్పుకునే వెబ్‌2, వెబ్‌3 స్టార్టప్‌లు.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వాడి పరిష్కారాలు కనుగొనడంపై ఆసక్తి చూపుతున్నాయి. ఇలా బ్లాక్‌ చైన్‌పై పని చేసే స్టార్టప్‌లకు సహకారాన్ని ‘టీ బ్లాక్‌ యాక్సలేటర్‌’, ‘ఇండియా బ్లాక్‌చైన్‌ యాక్సలేటర్‌’ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. టీ బ్లాక్‌ యాక్సలేటర్‌ కింది ఇప్పటికే 8 స్టార్టప్‌లు పని చేస్తున్నాయి.

అలాగే ఫిన్‌టెక్, వినోదం, సుస్థిరాభివృద్ధి, మౌళిక వసతులు, అగ్రిటెక్, లాజిస్టిక్స్, ఆరోగ్య రక్షణ వంటి రంగాల్లో బ్లాక్‌చైన్‌ స్టార్టప్‌లు చాలా పరిష్కారాలు చూపొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయికి టెక్నాలజీని తీసుకెళ్లి, బ్లాక్‌చైన్‌ వినియోగం పెంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది. ‘దేశ ఐటీ రంగంలో బ్లాక్‌చైన్‌ రంగం విస్తరణకు అవసరమైన నైపుణ్యం, సదుపాయాలపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది’అని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. 

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ అంటే?
బ్లాక్‌ టెక్నాలజీ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్‌ నెట్‌వర్క్‌. ఈ టెక్నాలజీలో బ్లాక్‌ అంటే ఒక భాగం. ఈ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వాళ్లు ఏదైనా లావాదేవీ గాని, ఇతరత్రా పనిగాని చేస్తే ఇచ్చే వాళ్లు, పుచ్చుకునేవాళ్ల వివరాలతో ఓ బ్లాక్‌ ఏర్పడుతుంది. ఈ బ్లాక్‌లో ఉన్న వాళ్లు ఇంకేదైనా లావాదేవీ చేస్తే ఇంకో బ్లాక్‌ ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ కలిపి చైన్‌ మాదిరి తయారవుతాయి.

ఈ మొత్తం చైన్‌లో ఎక్కడ ఏ బ్లాక్‌లో మార్పు జరిగినా మిగతావాళ్లు ఆమోదిస్తేనే జరుగుతుంది. ఈ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వాళ్లకు సీక్రెట్‌ కోడ్‌ ఇస్తారు. వాళ్లు మాత్రమే అందులోకి లాగిన్‌ అవగలరు. వేరేవాళ్లు, హ్యాకర్లు ఎవరైనా లాగిన్‌ కావాలని ప్రయత్నిస్తే క్షణాల్లో మిగతా వాళ్లకు తెలియజేసి అప్రమత్తమయ్యేలా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంటే ఈ టెక్నాలజీని హ్యాక్‌ చేయడం దాదాపు అసాధ్యమే.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top