
గవర్నర్ కోటాలో వచ్చినఎమ్మెల్సీ పదవికి గండం?
ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటున్న అభిమానులు
మరో వైపు సీటు కోసం ఇతరుల ప్రయత్నాలు
పట్టుబడుతున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ
సాక్షి,సిటీబ్యూరో/బంజారాహిల్స్: అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీటు కోసం తీవ్రపోటీ ఉండటంతో అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాముగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి బరి నుంచి తప్పించింది. తాజాగా ఆశావహుల జాబితా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్న సమయంలో.. తిరిగి అజహరుద్దీన్ పేరు తెరపైకి రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
గవర్నర్ కోటా నాన్ పొలిటికల్ కేటగిరీ కింద అజహరుద్దీన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఉండటంతో న్యాయపరమై చిక్కులతో పదవికి గండం తప్పదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయనకు కూడా ఆ అనుమానం వెంటాడుతోంది. మరోవైపు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా శనివారం బంజారాహిల్స్‌లోని అజహరుద్దీన్ నివాసానికి మైనారిటీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోటీ చేయాలంటూ పట్టుబట్టారు. వారం రోజులుగా కార్యకర్తల ఒత్తిళ్లు పెరుగుతుండటంతో ఆయన రెండు మూడు రోజులుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి మీనాక్షీ నటరాజన్
తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అధికార పక్షం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, యువనేత నవీన్ యాదవ్‌లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ మాత్రం తనకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బాధ్యతలను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు.
మజ్లిస్ కలిసి వస్తున్నందుకు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్‌కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు రంగంలో దిగి అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చేవిధంగా ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధికంగానే ఉన్నారు. తాజాగా మజ్లిస్ కూడా ఉప ఎన్నికల బరి నుంచి దూరం పాటిస్తున్నట్లు, కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలు ఇచి్చంది. ఆశావహుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో టికెట్ కోసం పోటీ తీవ్రంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి ఎంపికైనప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే హైదరాబాద్ మైనారిటీ కోటాలో మంత్రి పదవీ దక్కవచ్చని అజహరుద్దీన్ కూడా యూ టర్న్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.