శతాబ్దాల షహరీ..  మన నగరి!

Special Story On Hyderabad Secunderabad Ahead 430 years Completion - Sakshi

హైదరాబాద్‌ ఉరఫ్‌ భాగ్యనగరం

ముత్యాల రాశులకు నెలవైన అద్భుత నగరం

ఇప్పుడు ఐటీ ఎగుమతులతో ఖ్యాతి పొందుతున్న పట్నం

భాగ్యనగరం ఒకప్పుడు.. 30 వేల జనాభాతో కిటకిటలాడింది.. భవిష్యత్తు మీద బెంగతో గోల్కొండను వదిలింది.. అడిగింది లేదనకుండా ఇచ్చే అక్షయపాత్రగా అలరారింది.. చార్మినార్, హుస్సేన్‌సాగర్‌ వంటి నిర్మాణాలతో అబ్బురపరిచింది.. మరి ఇప్పుడు.. కోటి జనాభాతో కిక్కిరిసిపోతోంది.. ఆధునిక పరిజ్ఞానానికి కేరాఫ్‌ అడ్రస్‌గామారుతోంది.. శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు వేసుకుంటోంది.. సరికొత్త హైదరాబాద్‌గా మారేందుకు అడుగులేస్తోంది.. అలాంటి మన హైదరాబాద్‌ మహానగరం త్వరలోనే ఓ అద్భుతమైన మైలు రాయిని దాటనుంది. అదేంటంటే.. 2021 నాటికి.. గోల్కొండ రాజధానిగా అవతరించి 525 ఏళ్లుకానుంది. భాగ్యనగరం రూపుదిద్దుకుని 430ఏళ్లు పూర్తవుతుంది. సికింద్రాబాద్‌ ఏర్పడి 215 ఏళ్లు అవుతుంది.

తొలి అడుగు పడిందక్కడ
1496.. కాకతీయుల హయాంలో సైనిక పోస్టు, చిన్న గ్రామాల సముదాయంగా ఉన్న గోల్కొండ.. రాజధానిగా ఎదిగేందుకు 1496లో బీజం పడింది. ఈ ప్రాంతంపై దండెత్తి విధ్వంసం సృష్టించిన బహమనీ సామ్రాజ్యం.. సుల్తాన్‌ కులీని సుబేదారు (గవర్నర్‌)గా నియమించింది. పర్షియా నుంచి వచ్చిన ఆయన కుతుబ్‌షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూస్తుండగానే గోల్కొండ పట్టణంగా పురోగమించింది. అలా 95 ఏళ్లు కొనసాగింది.

సరికొత్త పరిజ్ఞానం
గోల్కొండ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు.. నాటి ఆధునికతను వాడుకుంటూ ముందుకు సాగారు. నీటి వనరుల కోసం గురుత్వాకర్షణ శక్తితో అందేలా ఎత్తయిన ప్రాంతంలో దుర్గం చెరువును తవ్వించారు. అక్కడి నుంచి ప్రత్యేక చానెళ్ల ద్వారా నీటిని తరలించి కోటలో నిల్వచేసేందుకు కటోరా హౌస్‌ను నిర్మించారు. ఆ నీళ్లు కోట భాగానికి చేరేందుకు ఈజిప్షియన్‌ వాటర్‌ వీల్‌ పరిజ్ఞానాన్ని వినియోగించారు.

అంటే మనం చూసే జెయింట్‌ వీల్‌ తరహాలో ఉండే ఏర్పాటన్న మాట. అది తిరిగే కొద్దీ కింది నీళ్లు పైకి చేరతాయి. అలా రెండు, మూడు యంత్రాలతో పూర్తి పైకి చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా దిగువకు పంపుతారు. అలాగే కింద అలికిడి అయితే పై వరకు వినిపించేలా ధ్వని శాస్త్రం ఆధారంగా ఏర్పాట్లు చేయించారు. ఇక గానా బజానాలు, కుస్తీ పోటీలు, వేడుకలతో నిత్యం కోట కళకళలాడుతుండేది.(చదవండి: వావ్‌ బాస్మతి.. బిర్యానీ రైస్‌కు భలే క్రేజ్‌)

1591.. భాగ్యనగరానికి పునాది
‘చెరువులో చేపల్లాగా ఈ కొత్త నగరం జనంతో నిండిపోవాలి’.. మహ్మద్‌ కులీ కుతుబ్‌షా దైవ ప్రార్థన ఇదీ. అప్పటికే గోల్కొండ నగరం దాదాపు 30 వేల జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో నగరాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఆయన పట్టాభిషిక్తుడైన 11 ఏళ్ల తర్వాత.. మూసీకి ఆవల కొత్త నగరానికి శంకుస్థాపన చేశాడు. శత్రువుల భయంతో కోట గోడల మధ్య గోల్కొండ ఉండగా, శత్రువులు లేరన్న ధీమాతో గోడల అవసరం లేకుండా హైదరాబాద్‌ను నిర్మించాడు. ఇరాన్‌ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్‌ మీర్‌ మొమీన్‌ ప్రణాళికతో నగరం రూపుదిద్దుకుంది. చూస్తుండగానే నగరం నలుచెరగులా విస్తరించింది. నిజాం(గవర్నర్‌)గా నియమితుడైన మీర్‌ ఖమ్రుద్దీన్‌ ఖాన్‌.. అసఫ్‌జాహీ పాలనకు శ్రీకారం చుట్టాడు. తొలుత ఆయన ఔరంగాబాద్‌ నుంచే పాలన సాగించారు. కానీ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో మళ్లీ నగర విస్తరణ పెరిగింది.

1806 జంట నగరం వెలసిందప్పుడే..
ప్రపంచ జంటనగరాల జాబితాలో హెదరాబాద్‌– సికింద్రాబాద్‌లు ప్రముఖంగా నిలుస్తాయి. దానికి బీజం పడి 215 ఏళ్లు అవుతోంది. మూడో నిజాం హయంలో సైనిక స్థావరం పేరుతో సికింద్రాబాద్‌లో ఈస్టిండియా కంపెనీ కాలు మోపింది. అది నిజాంకు మద్దతుగా ఉంటుందనీ నమ్మబలికింది. 5 వేల బ్రిటిష్‌ సైన్యంతో హుస్సేన్‌సాగర్‌కు ఉత్తరాన కంటోన్మెంట్‌ ఏర్పడింది. క్రమంగా బ్రిటిష్‌ అధికారులు, సైనిక పటాలాలు, స్థానికుల నివాసాలు పెరగటంతో అక్కడ తమకు ప్రత్యేకంగా నగరం ఏర్పాటుకు స్థలం చూపాలని నాటి బ్రిటిష్‌ రెసిడెన్సీ థామస్‌ సైడన్‌హామ్‌.. మూడో నిజాం మీర్‌ అక్బర్‌ అలీఖాన్‌ సికిందర్‌ జాకు లేఖ రాశాడు. ప్రస్తుతం కంటోన్మెంట్‌ ఉన్న స్థలాన్ని కేటాయిస్తూ దానికి తన పేర సికింద్రాబాద్‌ అని నామకరణం చేశాడు.

ఈ ప్రాంతానికి దిగుమతి సుంకంనుంచి మినహాయింపు ఉండటంతో శరవేగంగా ఆ ప్రాంతంవ్యాపారపరంగా అభివృద్ధి చెంది జనరల్‌ బజార్‌ లాంటివి విస్తరించాయి. విద్యాసంస్థలు, స్పోర్ట్స్‌ క్లబ్లులు, సాధారణ క్లబ్బులు, చర్చీలు, తమిళ, కన్నడ, మరాఠీ, పార్సీ వారి విస్తరణ.. కొత్త దేవాలయాలు.. ఒకటేమిటి సికింద్రాబాద్‌ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ కన్నా ప్రణాళికా బద్ధంగా, విశాలమైన రోడ్లు, ఎక్కడ చూసినా పరిశుభ్రత.. విదేశీ ప్రాంతం తరహాలో పురోగమించింది.

మలుపు తిప్పిన ఆరో నిజాం..
ముస్లిమేతరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, పరమత సహనానికి ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ..హైదరాబాద్‌ నిర్మాణం విషయంలో అసఫ్‌జాహీలుప్రత్యేకత చాటుకున్నారు. హిందూ సంస్కృతిపై దౌర్జన్యాల అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అయితే ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో ఆధునిక హైదరాబాద్‌కు బీజం పడింది. అప్పటికే రైల్వే లాంటి అరుదైన ప్రయాణ వసతి భాగ్యనగరాన్ని చేరింది. నూతన హైదరాబాద్‌ శిల్పిగా ఖ్యాతికెక్కిన ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్‌కు పిలిపించింది ఆరో నిజామే.

అప్పుడే విరుచుకుపడ్డ వరదలు హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేయటంతో మోక్షగుండం వచ్చి అద్భుత డ్రైనేజీ వ్యవస్థ, వరదకు అడ్డుకట్ట పడేలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నిర్మాణం జరిపిన విషయం తెలిసిందే. ఆరో నిజాం హయాంలో అందుకు ప్రణాళికలు రచించగా.. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో అమలైంది. ఇక ప్రపంచ కుబేరుడిగా చరిత్రలో నిలిచిన ఏడో నిజాం.. హైదరాబాద్‌కు పూర్తి ఆధునిక రూపునిచ్చాడు. భారతదేశంలో భాగంగా ఉండాలన్న కోరిక లేక పాకిస్తాన్‌కు అనుకూల వైఖరి ప్రదర్శించిన అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ప్రస్తుత హైదరాబాద్‌లో ఈ మాత్రం వసతులు ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం మాత్రం ఆయనే.
-సాక్షి, హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top