విద్యార్థులు లేకుండానే ఉపాధ్యాయులు బడికి

Schools Reopen: Teachers Attends Schools Without Students - Sakshi

కరోనా కల్లోలంలో విద్యాశాఖ తొలి అడుగు వేసింది. మార్చి 22న మూత బడ్డ పాఠశాలలు 158 రోజుల తర్వాత గురువారం తెరుచుకున్నాయి. విద్యార్థులు లేకుండానే టీచర్లు విధులకు హాజరయ్యారు. ముసురు వర్షంలో తడుస్తూ భయం భయంగా బడికి చేరుకున్నారు. కొన్ని చోట్ల శిథిలమైన పాఠశాల పైకప్పులు కూలి పోయాయి. విద్యావలంటీర్లు ఈ విద్యా సంవత్సరం తమను కొనసాగించాలంటూ ఎంఈఓలకు విజ్ఞప్తులు చేశారు.  

సాక్షి, పాపన్నపేట(మెదక్‌)కరోనా నేపథ్యంలో మార్చి 22న మూతబడ్డ పాఠశాలలు ఎట్టకేలకు గురువారం తెరుచుకున్నాయి. జిల్లాలో 942 ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 119 ప్రైవేట్‌ పాఠశాలలు, సుమారు 1.17 లక్షల మంది విద్యార్థులున్నారు. విద్యా సంవత్ససరం నష్ట పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గురువారం విద్యార్థులు లేకుండానే, ఉపాధ్యాయులతో బడులు ప్రారంభించింది. బడులు, ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించేందుకు సన్నద్ధ కార్యక్రమాలు, వర్క్‌షీట్లు, బేస్‌ లైన్‌ మదింపు, తరగతుల వారీగా కాంటెంట్‌ తయారీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సీఆర్పీలు, హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌ తరగతుల పర్యవేక్షణ చేయాలని సూచించారు. భయం.. భయంగా టీచర్లు. మెదక్‌ జిల్లాలో కోవిడ్‌ బారిన పడి మక్తభూపతిపూర్‌ పాఠశాలకు చెందిన ఫయాజ్, చందాయిపేటకు చెందిన శ్రీధర్‌రెడ్డి మరణించారు. గురువారం వారికి నివాళులర్పించారు. ఓ వైపు వర్షం పడుతుండటంతో టీచర్లు మొదటి రోజు చాలా ఇబ్బందులు పడుతు పాఠశాలకు వెళ్లారు.

చాలా మంది టీచర్లు ఆటోలు, బస్సుల్లో బడికి వెళ్తుంటారు. ముఖ్యంగా గిరిజన తండాలు, మారుమూల గ్రామాలకు వెళ్లే టీచర్లు బస్సులు లేక ఆటోల్లోనే వెళ్తారు. ఈ క్రమంలో సామాజిక దూరం పాటించే అవకాశం లేక ప్రాణాలరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. మొదటి రోజు పెద్ద శంకరంపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేసే శంకర్‌ నాయక్‌ అనే ఉపాధ్యాయుడు తన సొంత గ్రామమైన బూరుగుపల్లి తండా నుండి వస్తుండగా శంకరంపేట చౌరస్తాలలో లారీ కొనగా కాలు నుజ్జు, నుజ్జు అయ్యింది. నర్సాపూర్‌ మండలం ఎర్రకుంట తండాలో,పాపన్నపేట ఉన్నత పాఠశాలతో పాటు మరికొన్ని పాఠశాలలు వర్షంతో కూలుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రోజురోజుకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. టీచర్లు తమ విధులకు హాజరవుతుండగా తమను కూడా విధుల్లోకి తీసుకోవాలని విద్యావలంటీర్లు కోరుతున్నారు. 

భయంగానే వెళ్లాల్సివస్తోంది.. 
గ్రామాల్లో కరోనా చాలా వేగంగా విస్తరిస్తోంది. మారు మూల గ్రామాల్లో, గిరిజన తండాల్లో పనిచేసే టీచర్లకు బస్సు సౌకర్యం లేనందువల్ల విధిగా ఆటోల్లోనే ప్రయాణం చేసి బడికి వెళ్లాల్సి వస్తుంది. వ్యాపార ధోరణితో ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. పల్లె వాసుల్లో కొంతమంది కనీసం మాస్కులు ధరించకుండానే ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇక సామాజిక దూరం దేవుడెరుగు. దీంతో భయం భయంగా బడికి వెళ్లాల్సి వస్తుంది. – యశోద, ఉపాధ్యాయురాలు, పాపన్నపేట 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top