పల్లెల్లో ‘సహారా’ కలకలం.. నాలుగేళ్లలో రెండింతలిస్తామంటూ..

People Rage Over Sahara Deposit Scheme Telangana Karimnagar - Sakshi

మెచ్యూరిటీ తీరినా చేతికి అందని డబ్బు 

ఆందోళనలో డిపాజిటర్లు.. అవసరాలకు సొమ్ము అందక వెతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ‘సహారా’డిపాజిట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. సహారా బ్యాంకు పేరిట సేకరించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గడువు తీరినా సొమ్ము చెల్లించకపోతుండటంతో డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సహారా ఏజెంట్లను నిలదీస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇల్లు, స్థలాల కొనుగోలు, కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని.. ఇప్పుడు సొమ్ము రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.

సంస్థలో పలు ఆర్థిక సమస్యల కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, సొమ్ము వస్తుందని ఏజెంట్లు పైకి సర్ది చెప్తున్నా.. లోపల వారు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే సంస్థలో పనిచేసే ఓ మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. 

ఇంటి నష్ట పరిహారం పైసలు డిపాజిట్‌ చేశా.. 
మిడ్‌మానేరు కింద అనుపురంలో ముంపునకు గురైన ఇంటి నష్ట పరిహారం కింద వచ్చిన రూ.4.70 లక్షలను సహారాలో డిపాజిట్‌ చేశాను. ఏజెంట్లు 5 ఏళ్ల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయన్నారు. గడువు ముగిసి 16 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇప్పించాలి. 
– తాండ్ర రజిత, అనుపురం, సిరిసిల్ల జిల్లా 

అప్పుచేసి బిడ్డ పెళ్లి చేయాల్సి వచ్చింది 
మాది బిహార్‌. 30 ఏళ్ల కింద సిరిసిల్లకు వచ్చి స్థిరపడ్డాం. వేములవాడ, సిరిసిల్లలోని సులభ్‌ కాంప్లెక్స్‌లను కాంట్రాక్టు తీసుకొని పనిచేయిస్తున్నాను. ఏడేళ్ల కింద సహారా ఏజెంట్లు వచ్చి రూ.4.40 లక్షలు ఎఫ్‌డీ చేస్తే 5 ఏళ్ల 4 నెలలకు రూ.10 లక్షలు వస్తాయని చెప్పి డిపాజిట్‌ చేయించుకున్నారు. గడువు దాటి 17 నెలలు అయినా డబ్బివ్వలేదు. నా బిడ్డ పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది. 
– సునీల్‌ మిశ్రా, సిరిసిల్ల 

దాదాపు ఏడాదిన్నర నుంచి.. 
ఐదున్నరేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పడంతో చాలామంది తమ కష్టార్జితాన్ని సహారాలో డిపాజిట్‌ చేశారు. కొందరు ఒకేసారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేస్తే.. చాలా మంది వారానికోసారి, నెలకోసారి కట్టే రికరింగ్‌ డిపాజిట్లు (ఆర్‌డీ)గా పొదుపు చేశారు. వీరిలో చాలా వరకు కూలీలు, పేదలే. చివరిలో పెద్దమొత్తంలో సొమ్ము చేతికి అందుతుందని ఆశపడ్డవారే. సహారా సంస్థ ఏజెంట్లు గ్రామాల్లో పర్యటిస్తూ.. తమకున్న పరిచయాలతో డిపాజిట్లు సేకరిస్తున్నారు. కొన్నిరోజులుగా డిపాజిట్లు మరింత పెంచేందుకు నాలుగేళ్లలోనే సొమ్ము డబుల్‌ అవుతుందని చెప్తున్నట్టు తెలిసింది.

అయితే దాదాపు ఏడాదిన్నరగా డిపాజిట్లను తిరిగి చెల్లించడం లేదని.. గత ఏప్రిల్‌ నుంచి మొత్తంగా రావడం లేదని డిపాజిటర్లు చెప్తున్నారు. దీనితోపాటు డిపాజిటర్లు నెలనెలా చెల్లించే మొత్తానికి వారి పేరున కాకుండా ఏజెంట్‌ పేరుతో రశీదులు ఇవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై ఏజెంట్లను నిలదీయగా.. సంస్థకు సంబంధించిన పలు కారణాలతో ఇలా జరుగుతోందని పై అధికారులు చెప్పారని వివరిస్తున్నారు. సంస్థ అధికారులు ప్రతి శనివారం ఏజెంట్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తుంటారు.

ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌ 17న జూమ్‌ మీటింగ్‌కు హాజరైన అనంతరం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలకు చెందిన సహారా మేనేజర్‌ కందాల సంపత్‌ (55) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన హన్మకొండ జిల్లా కమలాపూర్‌ సహారా బ్రాంచికి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డిపాజిటర్లకు మెచ్యూరిటీ తీరినా సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఉందని, పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో సంపత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన కుమారుడు వినయ్‌ హుజూరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ ఘటన ఏజెంట్లలో ఆందోళన పెంచింది. 

సొమ్ము వస్తుంది.. ఆందోళన వద్దు! 
కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక చిక్కుల వల్ల మెచ్యూరిటీ పూర్తయినా డిపాజిట్లు చెల్లించలేకపోతున్న మాట వాస్తవమే. అయితే అత్యవసరమున్న వారికి సర్దుబాటు చేస్తున్నాం. డిపాజిటర్లు, ఏజెంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రశీదులు ఏజెంట్‌ పేరు మీద రావడమంటే అవన్నీ ముందస్తు చెల్లింపులే. దానిపై కంగారు వద్దు. డిపాజిటర్లకు భరోసా కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేనేజర్‌ సంపత్‌ ఆత్మహత్యకు ఇతర ఆర్థిక కారణాలే తప్ప.. సహారాకు సంబంధం లేదు. 
శ్రీనివాస్, సహారా సంస్థ రీజినల్‌ మేనేజర్, కరీంనగర్‌ 

సిరిసిల్లలో చీటింగ్‌ కేసులు 
సహారా సంస్థలో డిపాజిట్‌ చేసివారిలో ఎక్కువ మంది పేద, దిగువ మధ్య తరగతివారే. ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, చదువు, అనారోగ్యం తదితర అవసరాల కోసం.. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందన్న ఆశతో డిపాజిట్లు చేశారు. ఇప్పుడు సొమ్ము అందకపోవడంతో సంస్థపై, ఏజెంట్లపై చీటింగ్‌ కేసులు పెడుతున్నారు. ఇలా సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, వేములవాడ పోలీస్‌స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కరీంనగర్‌లో ఉన్న సహారా రీజనల్‌ మేనేజర్, ఇతర అధికారులను సిరిసిల్ల
ఎస్పీ రాహుల్‌ హెగ్డే పిలిపించి వివరణ కూడా తీసుకున్నారు.
చదవండి: కథ కంచికి.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top