
సీతంపేటలో శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామిగా దర్శనం
దేశంలోనే రెండోఆలయంగా ప్రసిద్ధి
500 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు
చింతకాని: చుట్టూ కొండలు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చని పొలాలు.. ఎత్తయిన గుట్టపై రాతి కొండలో స్వయంభువుగా వెలిసిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి కొలిచిన వారికి కొంగు బంగారంలా వర్థిల్లుతున్నాడు. భక్తులు పోసిన బెల్లం పానకాన్ని సగం స్వీకరించి.. మిగతాది ప్రసాదంగా మిగులుస్తూ పానకాల స్వామిగా పూజలు అందుకుంటున్నాడు.
త్రేతాయుగంలో హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించే క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట సమీపాన ఉన్న కొండపై ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై నర్సింహస్వామి స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పానకాల స్వామి ఆలయం.. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి తర్వాత తెలంగాణలోని సీతంపేటలో మాత్రమే ఉంది.
ఘనమైన ఆలయ చరిత్ర
త్రేతాయుగంలో నర్సింహస్వామి.. హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించి తిరిగి వైకుంఠానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా వెళ్తున్నాడట. మార్గమధ్యలో సీతంపేట వద్ద ప్రకృతి రమణీయతతో అలరారుతుండటంతో దేవేరుల కోరిక మేరకు స్వామి ఇక్కడ కొండపై స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మిక.
500 ఏళ్ల క్రితం..
సుమారు 500 ఏళ్ల క్రితం ఈ ప్రాంత జమీందారు, నాగులవంచ పరగణా«దీశుడు గడ్డం సీతారామిరెడ్డి తాత భూపతిరెడ్డికి సంతానం లేకపోవటంతో.. ఆ దంపతులు ఇష్ట దైవం నర్సింహస్వామిని నిత్యం పూజించేవారు. ఒకరోజు భూపతిరెడ్డి కలలో కనిపించి దేవుడు ‘నీకు సంతానం కలగాలంటే నాకు గుడి కట్టించాలి. జ్యోతి రూపంలో ఆకాశమార్గంలో వెళ్తుంటాను.
ఆ జ్యోతి ఎక్కడయితే అదృశ్యమవుతుందో అక్కడే ఆలయం నిర్మించాలి’.. అని చెప్పి అదృశ్యమయ్యాడట. దీంతో జమీందార్ సూచనల మేరకు పండితులు అన్వేషిస్తుండగా సీతంపేట వద్ద అడవిలోని కొండల మధ్యలో.. రాతి కొండపై స్వామి వారు దేదీప్యమానంగా దర్శమిచ్చారట. భూపతిరెడ్డి రాతి కొండపై స్వామి గుడి కట్టించాడు. తదనంతరం జమీందారుకు సంతానం కలిగింది. కాగా, స్వామి ఇక్కడ ఏనుగు పడుకున్న ఆకారాన్ని పోలి ఉండడంతో.. శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిగా కొలుస్తున్నారు.
పానకాల స్వామిగా..
నర్సింహస్వామికి పాంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆరాధన, పూజలు నిర్వహించేవారు. కొంతకాలానికి ఒక భక్తుడిని స్వామి వారు ఆవహించి.. ‘నాకు దప్పికగా ఉంది. బెల్లం పానకం పోయండి’.. అని సూచించారట. దీంతో అర్చకులు బిందెలతో పానకం పోయగా.. సగం మాత్రమే స్వీకరించారని ప్రతీతి.
ఇదేమిటని ప్రార్థించడంతో ‘సగం పానకాన్నే స్వీకరిస్తా.. మిగతాది భక్తుల కోసం’.. అని చెప్పినట్లు ప్రతీతి. దీంతో అప్పటి నుంచి శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిని పానకాల స్వామిగా కొలుస్తున్నారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
కొండపై కోనేరు..
కొండపై ఆలయం, కోనేరు ఉంటాయి. ఈ కోనేరు స్వామి వారి పాదముద్రల ఆకారంలో ఉండడంతో పాటు ఎండాకాలంలో ఎక్కడా నీరు లేకున్నా కోనేరు మాత్రం ఎండిపోయిన దాఖలాలు లేవు. దీన్ని స్వామి మహిమగా భక్తులు చెప్పుకుంటారు. కాగా, త్రిదండి చినజీయర్ స్వామి 2004లో ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు ఆయన హాజరయ్యారు.
ధూపదీప నైవేద్యానికి 150 ఎకరాలు
నైజాం నవాబు భూమి శిస్తు వసూళ్ల కోసం ఈ ప్రాంతానికి రాగా జమీందారు భూపతిరెడ్డి ఆయనను ఆలయానికి తీసుకెళ్లాడట. అక్కడ పానకం మహిమను వివరిస్తే నవాబు స్వామి విగ్రహం నోట్లో చేయి పెట్టి అబద్ధమని పరిహాసమాడాడట. దీంతో ఆగ్రహించిన స్వామి.. తన దంతాలతో నవాబు చేయి బయటకు రాకుండా పట్టుకోవడంతో.. ఆయన క్షమించమని కోరడమే కాక ధూపదీప నైవేద్యాల నిమిత్తం కనుచూపు మేర ఉన్న భూమిని ఆలయానికి రాసిచ్చాడని చెబుతారు.
కాగా, భూపతిరెడ్డి వంశీయులైన నాగులవంచ గ్రామానికి చెందిన గడ్డం ఉపేందర్‌రెడ్డి కుటుంబీకులు గత మూడేళ్ల వరకు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులుగా కొనసాగారు. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతోంది. అయితే, ఆలయం పేరిట ఉన్న 150 ఎకరాల భూమిని అమ్మి నగదు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ నగదు ఎటూ సరిపోనందున.. ప్రభుత్వం స్పందించి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు
ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలి
తెలంగాణలో స్వామి పానకం తాగే ఏకైక ఆలయం సీతంపేటలోనే ఉంది. పచ్చని పంట పొలాల మధ్య ఎత్తయిన కొండపై స్వామి స్వయంభువుగా వెలిశారు. ఘనచరిత్ర కలిగిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. – చుండూరు రామకోటేశ్వరరావు, ఆలయ ఈవో
నిర్వహణ కష్టంగా ఉంది
శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలి. దేశంలో ఉన్న రెండు ఆలయాల్లో సీతంంపేటలో ఒకటి ఉంది. ఆలయానికి ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీతో ఆలయ నిర్వహణ కష్టంగా ఉంది. ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలి. – పీవీ రమణాచార్యులు, ఆలయ అర్చకుడు