రెండో డోసుకు తొందరొద్దు

No Hurry About Second Dose Of Corona  Vaccine - Sakshi

 కోవాగ్జిన్‌పై భారత్‌ బయోటెక్‌ ప్రతినిధి రేచస్‌ ఎల్లా

ఆలస్యంగా తీసుకున్నా సామర్థ్యంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: కోవాగ్జిన్‌ టీకా ఒక డోసు తీసుకుని.. నిర్ణీత వ్యవధిలోగా రెండో డోసు తీసుకోలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్‌ బయోటెక్‌ వ్యాపారాభివృద్ధి విభాగపు అధ్యక్షుడు డాక్టర్‌ రేచస్‌ ఎల్లా స్పష్టం చేశారు. 28 రోజుల వ్యవధిలో 2 టీకాలు వేసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత రెండు వారాలకు తీసుకున్నా కూడా సామర్థ్యంలో పెద్దగా తేడా ఏమీ ఉండదని వివరించారు. ఒకవేళ ఎవరైనా 6 వారాల తర్వాత కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడినా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌ విభాగం కోవిడ్‌ వ్యాక్సిన్లపై శనివారం ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రజ్ఞ చిగురుపాటి వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కోవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్న 3 నెలలకు కూడా దాని సామర్థ్యంలో ఎలాంటి మార్పులు ఉండదని తేలినందువల్లే రెండు టీకాల మధ్య వ్యవధిని పెంచారని తెలిపారు. 

యాంటీబాడీ టెస్టులు వద్దు.. 
కోవిడ్‌ టీకాలు తీసుకున్న వారు తరచూ యాంటీబాడీ పరీక్షలు చేయించుకుంటున్నారని, ఇది వృథా ప్రయాస అని డాక్టర్‌ రేచస్‌ తెలిపారు. టీకా తీసుకున్న 3, 4 వారాలకు ఉత్పత్తయ్యే యాంటీబాడీలు కొంతకాలం వరకు కోవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పారు. టీకా తీసుకున్న తర్వాత 3 నెలల వరకు శరీరంలో పెద్ద ఎత్తున యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు ఇప్పటికే తెలిసిందని, 6 నెలల తర్వాత పరిస్థితి ఏంటన్న అంశంపై భారత్‌ బయోటెక్‌ ప్రస్తుతం విశ్లేషణ జరుపుతోందని తెలిపారు. రెండు డోసులు వేసుకున్న తర్వాత శరీరంలో మరింత ఎక్కువ కోవిడ్‌ రక్షణ కల్పించేందుకు బూస్టర్‌ డోస్‌ ఒకటి అవసరం కావొచ్చని, ఎప్పటికప్పుడు వైరస్‌ రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఈ బూస్టర్‌ డోస్‌ అవసరం మరింత పెరిగిందని చెప్పారు. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి కోవాగ్జిన్‌ ఇచ్చే విషయంపై జూన్‌ మొదటి వారంలో ప్రయోగాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top