అవి శివుడి గుడి స్తంభాలు.. ఇది హిడింబి ఇసుర్రాయి! 

Naturally Formed Stone Pillars Identified in Asifabad District - Sakshi

సహజ సిద్ధ ఆకృతులపై వింత ప్రచారం 

లావా ఘనీభవించి ఏర్పడ్డ రాళ్లుగా గుర్తించిన పరిశోధకులు 

సాక్షి, హైదరాబాద్‌: మీటర్లకొద్దీ పొడవున్న నిలువు రాళ్లు.. ఏదో పనికోసం యంత్రంతో కోసినట్టుగా చక్కటి ఆకృతులు.. ఒకదాని తర్వాత ఒకటి పడుకోబెట్టినట్టుగా ఉన్న రాతి శిలలు.. అవి శివుడి గుడి స్తంభాలు అంటూ స్థానికంగా ఓ ప్రచారం.. 

►దారిపక్కన టన్నుల బరువున్న విశాలమైన రెండు రాళ్లు.. వృత్తాకారంలో ఒకదానిపై మరొకటి పేర్చినట్టు ఆకృతి.. అది ఒకనాటి ఇసుర్రాయి అని, భారతంలో ప్రస్తావించే హిడింబి దాన్ని వాడేదని ఓ గాధ.. 

►చిత్రమైన ఆకృతుల్లో, మనం నిత్యం వాడే పరికరాల ఆకారాల్లో ఉండే రాళ్లు జన బాహుళ్యంలో వింత ప్రచారానికి కారణమవుతాయి. అలాంటివే ఈ రాళ్లు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడి మనను ఆకట్టుకుంటున్నాయి. వీటి వెనుక ఎలాంటి చారిత్రక, పౌరాణిక గాథ లేదని తేల్చిన నిపుణులు దీనిపై స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 

రాతి స్తంభాల ఆకృతిలో.. 
ఆసిఫాబాద్‌ జిల్లా బోర్‌లాల్‌గూడ అడవిలో ప్రకృతి చెక్కిన రాతి స్తంభాలు ఉన్నాయి. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద లావా ఉబికివచ్చి కడ్డీల ఆకృతుల్లో ఘనీభవించిన రాతి శిలలు అవి. కాలమ్నార్‌ బసాల్ట్స్‌గా పేర్కొనే ఈ శిలలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు తిరుపతి మిత్రబృందం గుర్తించింది. తెలంగాణలో తొలిసారిగా ఏడేళ్ల కింద ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ శాంతిపూర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో కూడా ఇలాంటి రాళ్లను గుర్తించారు.

తాజాగా రెండో చోట అవి బయటపడినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. ఈ ప్రాంతాన్ని భూభౌతిక స్మారక ప్రాంతంగా గుర్తించాలని కోరారు. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో సెయింట్‌ మేరీ ద్వీపాల్లో ఇలాంటి రాతి స్తంభాలను గుర్తించిన జీఎస్‌ఐ.. దేశంలో గుర్తింపు పొందిన 34 జాతీయ భూభౌతిక స్మారక ప్రాంతాల్లో ఒకటిగా చేర్చిందని తెలిపారు. బోర్‌లాల్‌గూడలో ఈ లావా శిలలున్న ప్రాంతంలో పురాతన శివలింగం వెలుగుచూడటంతో.. శివుడి గుడి కోసం రూపొందించిన స్తంభాలుగా వీటి గురించిన గాథ ప్రచారంలో ఉందని వెల్లడించారు. 

ఇసుర్రాయి రూపంలో.. 
హైదరాబాద్‌ శివార్లలో ఇబ్రహీంపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో దండుమైలారం వెళ్లేదారిలో రోడ్డు పక్కన భారీ వృత్తాకార రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. ఇది మహాభారతంలో హిడింబి అనే రాక్షస స్త్రీ వాడిన ఇసుర్రాయిగా ఓ గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది.

బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్‌ ఇన్‌చార్జి శ్యాంసుందర్, శిల్పి హర్షవర్ధన్‌తో కలిసి చరిత్ర పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి వీటిని పరిశీలించి.. అవి సహజసిద్ధంగా ఏర్పడ్డవేనని గుర్తించారు. కోట్ల ఏళ్ల పరిణామ క్రమంలో రాళ్లు ఇలా ఒకదానిపై మరొకటి ఏర్పడటం సహజమని.. వీటిని బ్యాలెన్సింగ్‌ స్టోన్స్‌గా పిలుస్తారని తెలిపారు. వీటిని కాపాడుకుంటే ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేకతగా ఉంటుందని స్థానికులకు సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top