సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రెండ్రోజుల క్రితం వరకు సాధారణ వాతావరణం ఉండగా.. వాతావరణ మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 5.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడం గమనార్హం. రానున్న అయిదు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యధికంగా నల్గొండ కేంద్రంలో 41.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీల సెల్సియస్ అధికమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. రానున్న ఐదురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా, మిగతా జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.



