Tenders Awarded for Rail Anti-collision System ‘Kavach’ in Delhi-Mumbai - Sakshi
Sakshi News home page

కవచ్‌ మరింత భద్రం

Jul 22 2023 4:11 AM | Updated on Jul 22 2023 6:30 PM

Kavach Technology is more secure - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా సొంతగా రూపొందించిన కవచ్‌ పరిజ్ఞానానికి మరింత పదును పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్‌ అనంతరం దాన్ని వినియోగించేందుకు గతేడాది రైల్వే బోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేలో దాదాపు 1,500 కి.మీ. మేర ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు.

కానీ గత నెలలో ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన అనంతరం కవచ్‌ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ దుర్ఘటనలో ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘోర దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచే స్థాయిలో, 295 మంది వరకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

కవచ్‌ పరిజ్ఞానం ఆ మార్గంలో ఏర్పాటు చేసి ఉంటే, ఈ ప్రమాదం తప్పి ఉండేదంటూ అప్పట్లో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. కానీ రైల్వే అధికారులు మాత్రం ‘ఆ మార్గంలో ఒకవేళ కవచ్‌ పరిజ్ఞానం ఏర్పాటై ఉన్నా.. ఈ ప్రమాదాన్ని నిలువరించే వీలుండేది కాదు..’అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవచ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది.

కవచ్‌ ఏర్పాటు ఇక వేగవంతం.. 
ట్రయల్స్‌ స్థానికంగా నిర్వహించినందున దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,500 కి.మీ. మేర కవచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీతో లింక్‌ అయి ఉన్న మార్గాల్లో కనీసం 4 వేల కి.మీ. మేర ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఇక దాని ఏర్పాటు పనులు వేగంగా పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సంవత్సరానికి కనీసం 8 వేల కి.మీ. పూర్తి చేసేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. రెండు వేర్వేరు టెండర్ల ద్వారా 12 వేల కి.మీ. ఏర్పాటుకు సిద్ధమైంది. వచ్చే పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్ష కి.మీ. వరకు దాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.  

కొత్త అనుమానాలు..
ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు చేరువగా వచ్చినా, బ్రేక్‌ కొట్టాల్సిన సమయంలో లోకో పైలట్‌ విస్మరించినా, సిగ్నల్‌ను లోకో పైలట్‌ పట్టించుకోకుండా రైలును ముందుకు పోనిచ్చినా.. లోకో పైలట్‌తో ప్రమేయం లేకుండా కవచ్‌ పరిజ్ఞానం పని ప్రారంభించి ప్రమాదం జరక్కుండా నిలువరిస్తుంది. ఇది కవచ్‌ పనితీరును పరిశీలించే క్రమం (ట్రయల్స్‌)­లో స్పష్టమైంది. అంతవరకు దాని పనితీరును శంకించాల్సిన అవసరం లేదు. కానీ బాలా­సోర్‌ ప్రమాదం కొత్త అనుమానాలను తెరపైకి తెచ్చింది.

ఆరోజు.. మెయిన్‌లైన్‌లో గ్రీన్‌ సిగ్నల్‌ ఉంది. ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ మేరకు దూసుకుపోయింది. కానీ ట్రాక్‌ పాయింట్‌ మాత్రం లూప్‌లైన్‌తో అనుసంధానమై ఉంది. దీంతో 127 కి.మీ. వేగంతో వచ్చిన రైలు ఒక్కసారిగా లూప్‌లైన్‌లోకి వెళ్లి.. అక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలో నిలిచి ఉన్న గూడ్సు రైలును ఎనిమిది సెకన్ల (లూప్‌లైన్‌లోకి ప్రవేశించాక) వ్యవధిలోనే ఢీకొంది. దీంతో కవచ్‌ ఉన్నా.. ట్రాక్‌ పాయింట్‌ లూప్‌లైన్‌­తో అనుసంధానమై ఉందన్న విషయాన్ని ముందుగా గుర్తించేది కాదని నిపుణులంటున్నారు.

గ్రీన్‌ సిగ్నల్‌ ఉండటం, ఎదురుగా ఆ ట్రాక్‌పై మరో రైలు లేకపోవటంతో కవచ్‌ మిన్నకుండిపోతుందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఇదే కోణంలో కవచ్‌ను మరింత మెరుగ్గా తయారుచేసి, కొత్తగా పరీక్షలు నిర్వహించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సిగ్నల్‌కు విరుద్ధంగా, పాయింట్‌ తప్పుగా మరో లైన్‌కు లింక్‌ అయి ఉంటే దాన్ని కూడా కవచ్‌ గుర్తించేలా మార్చబోతున్నారు. కవచ్‌ పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్‌–వికారాబాద్‌–­వాడీ సెక్షన్ల మధ్య ట్రయల్స్‌ చేసినందున.. తదుపరి పరీక్షలు కూడా ఇక్కడే చేసే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement