చాయిస్‌ ఫిల్లింగ్‌లో అప్రమత్తం | Sakshi
Sakshi News home page

చాయిస్‌ ఫిల్లింగ్‌లో అప్రమత్తం

Published Sun, Sep 4 2022 1:07 AM

IIT Madras Director Kamakoti Comments On Josaa Counselling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో నిర్వహించే ‘జోసా’ ప్రక్రియలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణులు తమ చాయిస్‌ ఫిల్లింగ్, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల ప్రాథమ్యాల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఐఐటీ–మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి సూచించారు. వందల సంఖ్యలో ఆప్షన్స్‌ ఇచ్చే అవకాశమున్నందున చిన్న పొరపాటు కూడా భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారవచ్చునని హెచ్చరించారు.

ఈ నెల 11న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల విడుదల, ఆ మర్నాడే ‘జోసా’ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థులు ‘ఆస్క్‌ ఐఐటీఎం’ పేరుతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో కామకోటి పాల్గొన్నారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. ఐఐటీ మద్రాస్‌ విశిష్టతలను వివరించారు.

ఇష్టమైన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు
ప్రస్తుతం ఇంటర్‌ డిసిప్లినరీ విధానంలో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌లో ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా.. కోర్‌ సబ్జెక్ట్‌లతోపాటు తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్ట్‌లను చదివే అవకాశం ఉందని.. వీటిలో పొందిన క్రెడిట్స్‌ను సైతం బీటెక్‌ ప్రోగ్రామ్‌కు కలుపుతారని కామకోటి తెలిపారు. ఫలితంగా తమ ర్యాంకుకు వచ్చిన బ్రాంచ్‌తో తృప్తిపడకుండా ఇష్టమైన సబ్జెక్ట్‌లు చదివే అవకాశం విద్యార్థులకు లభిస్తుందన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ పీజీ (బీటెక్‌+ఎంటెక్‌) ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు నాలుగో సెమిç­Ü్టర్‌లో తమకు ఆసక్తిఉన్న వేరే బ్రాంచ్‌కు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇంజనీరింగ్‌ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా..  వైద్య రంగానికి అవసరమైన టెక్నాలజీలను అభి­వృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామ­న్నారు. వైద్య అనుబంధ అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.

వాస్తవ పరిస్థితులను పరిగణిస్తూ బోధన, కరిక్యులం, పరిశోధనల విషయంలో ఎప్పటి­కొప్పుడు మార్పులు, చేర్పులు చేపడుతున్నామని సృజనాత్మకతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని రకాల  అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే ఐఐటీ మద్రాస్‌ ఏడేళ్లుగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో కొనసాగుతోందన్నా­రు. విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్లూ దక్కు­తున్నాయని కామకోటి చెప్పారు.  2021–22 విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థుల్లో 80 శాతం మందికి ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ లభించాయని, మొత్తం 1,199 మందికి ఆఫర్లు లభించగా అందులో 45 మందికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు.

25 శాతం మేర తెలుగు విద్యార్థులే
ఐఐటీ మద్రాస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 25 శాతం మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారని ప్రొఫెసర్‌ కామకోటి తెలిపారు.

అన్ని రంగాల్లోనూ మంచి అవకాశాలు
‘ప్రస్తుత తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కెరీర్‌ అంటే ఇంజనీరింగ్, అందుకు ఐఐటీలే మేలు మార్గమని అనే భావన నెలకొంది. అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అవకాశాలు బాగానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల సహజ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఇతర కోర్సులకూ ప్రాధాన్యమివ్వాలి. ఐఐటీలో సీటు రాకపోతే భవిష్యత్తు లేదన్న ఆందోళన అర్థరహితం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తి ఏంటో తెలుసుకోకుండానే వారిని బీటెక్, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇది సరికాదు’ అని కామకోటి అన్నారు.

ఆన్‌లైన్‌ కోర్సులను అందిపుచ్చుకోవాలి
‘ఐఐటీలో చేరే అవకాశం కోల్పోయిన విద్యార్థులు ఆన్‌లైన్‌ కోర్సుల అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం ఎన్‌పీటీఈఎల్‌ పోర్టల్‌ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్ల లెక్చర్లు వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ తరగతి గదిలో చెప్పిన అంశాలు యథాతథంగా ఉంటాయి. వీటిని అనుసరించడం ఫలితంగా నిపుణులైన ప్రొఫెసర్ల లెక్చర్లు విని తమ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుంది’ అని కామకోటి సూచించారు.

రెండేళ్లుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఐఐటీలపై క్రేజ్‌ తగ్గుతోందనే అభిప్రాయం సరికాదని అన్నారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరైన ఈ సదస్సులో కామకోటితోపాటు ఐఐఎం–ఎం అలూమ్నీ అండ్‌ కార్పొరేట్‌ రిలేషన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ మహేశ్‌ పంచాజ్ఞుల, ఆస్క్‌ ఐఐటీఎం ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement