‘కాళేశ్వరం’పై నివేదిక ఎందుకు బయటపెట్టారు?: హైకోర్టు | High Court questions Telangana govt on Justice Ghosh Commission report | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’పై నివేదిక ఎందుకు బయటపెట్టారు?: హైకోర్టు

Aug 22 2025 12:56 AM | Updated on Aug 22 2025 12:56 AM

High Court questions Telangana govt on Justice Ghosh Commission report

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టుపై సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు

అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీ ఎందుకు?

మీడియాకు అధికారికంగా నివేదిక విడుదల చేశారా? 

నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా? అని అడిగిన ధర్మాసనం 

అధికారికంగా విడుదల చేయలేదు, అసెంబ్లీలో చర్చించలేదన్న ఏజీ 

అసెంబ్లీలో చర్చ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడి 

పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని విజ్ఞప్తి 

కమిషన్‌ నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు 

నివేదికపై సీఎం మీడియాకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారని వెల్లడి 

పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైకోర్టు దృష్టికి..  

నివేదిక రద్దు చేయాలంటూ విజ్ఞప్తి.. తదుపరి విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడి యాకు అందజేశారా?, మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్‌ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు. 

ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ ఘోష్‌ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ, కమిషన్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

రాజకీయ కక్షతో కమిషన్‌ ఏర్పాటు 
కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘మేడిగడ్డ బరాజ్‌కు సంబందించిన ప్రతిదీ కేబినెట్, ఇంజనీర్ల సూచనలు, ఆమోదంతోనే జరిగింది. దురదృష్టవశాత్తు అసాధారణ వర్షాలతో ఓ పిల్లర్‌ కుంగింది. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయినా ప్రభుత్వం రాజకీయ కక్షతో జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. కమిషన్‌ చట్ట నిబంధనలు పాటించలేదు. చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధతను, ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించింది. 

మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, నివేదిక కాపీ ఇవ్వాలని కోరినా ఇప్పటివరకు ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నివేదికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దానిపై అసెంబ్లీలో చర్చించాలని తీర్మానించారు. అసెంబ్లీలో చర్చించకుండానే ప్రభుత్వం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌తో నివేదికలోని వివరాలు మీడియాకు తెలియజేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియా సమావేశంలో నివేదికను బహిర్గతం చేశారు. నివేదికపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సారాంశాన్ని వందలాది అధికారిక, అనధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారు.  

దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు 
సీఎం, మంత్రులు పదే పదే ప్రెస్‌మీట్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ, పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం పాకులాడుతూ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో అప్రతిష్టపాలు చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిటిషనర్లకు నోటీసులు సైతం సరైన విధానంలో ఇవ్వలేదు. చట్టంలోని సెక్షన్‌ 8బీ, 8సీ కింద సమన్లు జారీ చేయలేదు. కేవలం సాక్షిగానే నోటీసులిచ్చారు. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాక్షులు ఇచ్చిన వివరాలపై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాలనుకుంటే 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వాలి. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం మా ప్రతిష్టను దెబ్బతీసేలా పక్షపాతంతో, చట్టవిరుద్ధంగా సమర్పించిన నివేదికను రద్దు చేయాలి..’ అని కోరారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ, ఎల్‌కే అద్వానీపై కమిషన్లను కొట్టివేసిన కేసులకు సంబంధించిన వివరాలు ధర్మాసనానికి అందజేశారు.  

ఇద్దరూ శాసనసభ్యులే.. అందుకే అసెంబ్లీలో చర్చ 
ప్రభుత్వం, కమిషన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. నివేదిక నేరుగా అసెంబ్లీలో బహిర్గతం చేస్తాం. పిటిషనర్లు ఇద్దరూ శాసనసభ సభ్యులు. ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించి ప్రాజెక్టు నిర్మించారు..’ అని చెప్పారు. 

ఈ సందర్భంగా సీజే జోక్యం చేసుకున్నారు. అసెంబ్లీలో చర్చించాలని భావించినప్పుడు నివేదికను మీడియాకు ఎందుకు విడుదల చేశారని ఏజీని ప్రశ్నించారు. ‘నివేదిక ప్రతిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టారా?, పిటిషనర్లకు 8బీ కింద నోటీసులిచ్చారా? నివేదిక ప్రస్తుత స్థితి ఏంటీ? అసెంబ్లీలో ప్రవేశపెట్టారా?’ అని అడిగారు. 

మీడియాకు ఇవ్వలేదు..పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదు 
మీడియాకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, పబ్లిక్‌ డొమైన్‌లోనూ పెట్టలేదని ఏజీ బదులిచ్చారు. నివేదికకు కేబినెట్‌ ఆమోదం తర్వాత రూపొందించిన 60 పేజీల త్రిసభ్య కమిటీ నివేదికలోని వివరాలను మీడియాకు ఇచ్చామని చెప్పారు. 8బీ కిందే పిటిషనర్లకు నోటీసులిచ్చామని తెలిపారు. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. 

కిరణ్‌బేడీ, ఎల్‌కే అద్వానీ కేసులు ఇక్కడ వర్తించవని వాదించారు. కాగా, తనకు సమర్పించిన నివేదిక ప్రతి సరిగా కనిపించడం లేదంటూ కొన్ని పాయింట్లు హైలైట్‌ చేసి ఉండటంపై సీజే అభ్యంతరం తెలిపారు. విచారణను నిలిపివేద్దాం అని అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో విచారణ కొనసాగించారు. వివరాలు స్పష్టంగా ఉన్న కాపీ ఇవ్వాలని వారికి సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకుని చెప్పాలని ఏజీకి సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement