వారి త్యాగాలను హేళన చేయొద్దు

Etela review on coronavirus in Kamareddy - Sakshi

కోవిడ్‌ విషయంలో రాజకీయాలు తగవు 

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి, కామారెడ్డి/నిజామాబాద్‌ అర్బన్‌: ‘కోవిడ్‌ పేషెంట్ల దగ్గర రక్త సంబంధీకులు కూడా ఉండలేరు. అలాంటిది డాక్టర్లు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వారికి సేవలు చేస్తున్నారు. కోవిడ్‌ బారినపడ్డ వారిని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాలు, మేధావులు, మీడియా వారిని అభినందించాల్సిందిపోయి వారి త్యాగాలను హేళన చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఉదయం కామారెడ్డిలో, మధ్యాహ్నం నిజామాబాద్‌లో కోవిడ్, సీజనల్‌ వ్యాధులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో సంఘటితం కావాల్సిందిపోయి చావులనూ రాజకీయం చేస్తున్నారని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్‌ నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా  రాత్రింబవళ్లు కరోనాపై యుద్ధం చేస్తున్నారని కొనియాడారు. కోవిడ్‌తో చనిపోయినవారి శవాలు వైద్య కళాశాలకు పనికిరావని తెలిపారు. శవాలను తరలించడానికి కుటుంబసభ్యులు రాకపోతే వైద్య, మున్సిపల్‌ సిబ్బంది తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లోనూ శవాలు మార్చినట్టు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

పెద్ద, పెద్ద వైరస్‌లను ఎదుర్కొన్నాం.. 
కరోనా కన్నా పెద్ద, పెద్ద వైరస్‌లు ఎదుర్కొన్నామని, అయితే అప్పుడు ఇంత ప్రచారం ఉండేది కాదని మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను సరఫరా చేశామన్నారు. క్షేత్రస్థాయిలో తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా పరవాలేదని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కావలసినన్ని వెంటిలెటర్లు సిద్ధంగా ఉంచామన్నారు.

మరణాల శాతం తక్కువ.. 
రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల శాతం అతి తక్కువగా ఉందని మంత్రి ఈటల తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ అమలు తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, వీరికి కరోనా వైరస్‌ సోకకుండా ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం హోం ఐసోలేషన్‌ కిట్‌లను ఆవిష్కరించారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రమేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, హన్మంత్‌ షిండే, నిజామాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, కామారెడ్డి జెడ్పీ చైర్మన్‌ దఫేదర్‌ శోభ, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top