ఏరువాక వైభవం.. సాగు సంబురం

Eruvaka Pournami: Significance Of Eruvaka Purnima Farmers Festival - Sakshi

సాక్షి, విద్యానగర్‌(కరీంనగర్‌): తొలకరి పిలుపు రైతన్న మోములో చిరునవ్వు, పిల్ల కాలువల గెంతులాట, పుడమితల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే ప్రారంభమవుతుంది. 

ఏరువాక అంటే..
అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే వేడుక. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఈరోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టేకాడిని దూపదీప నైవేద్యాలతో పూజించి, ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. భూమిని దుక్కి దున్నడం ప్రారంభిస్తారు.  

దేశమంతటా..
ఏరువాకను జ్యోతిష, శాస్త్రవేత్తలు కృష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడిపంటలకు, పొలం పనులకు ఆటంకాలు ఎదురుకావొద్దని కోరుకుంటూ ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాళ్లల్లో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగాను భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే ఈ రోజే ఒడిశాలోని పూరీ జగన్నా«థునికి స్నానోత్సవం నిర్వహిస్తారు.

అతి ప్రాచీనమైన పండుగ..
ఏరువాక అతి ప్రాచీనమైన పండుగ. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు రైతుల కృషిని అభినందించి, తగిన రీతిలో వారిని ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోధన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని రైతులకు అందించినట్లుగా కథలున్నాయి. ఏరువాకతో వ్యవసాయానికి సిద్ధమయ్యే రైతులకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం. 

రైతుకు అండగా ప్రభుత్వం.. 
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు అండగా నిలిచి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. భూరికార్డుల ప్రక్షాళనతో అన్నదాతలకు కొత్త పాసుబుక్కులు ఇచ్చింది. రైతు రుణమాఫీ అమలు చేస్తూ పంట బీమా సౌకర్యం కల్పిస్తోంది. రైతుబంధు పథకంతో ఏటా ఏటా ఎకరానికి రూ.10 వేలు నేరుగా అన్నదాతల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు బీమా పథకం ధ్వారా 18 నుంచి 59 ఏళ్లలోపు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి తక్షణం రూ.5 లక్షలు పరిహారంగా అందిస్తోంది. ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి 100 సంచార పశు వైద్యశాలను నిర్వహిస్తోంది. 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తేవడమే కాకుండా బీడు భూములకు, ఎండిన చెరువులు, కుంటలకు కాళేశ్వరం జలాల ద్వారా సాగు నీరందిస్తోంది. లాక్‌డౌన్‌లో రైతులు ఆగం కావొద్దని పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, బాసటగా నిలిచింది. 

దిగుబడి పెరిగితే సాగు లాభమే 
మాకు మానకొండూర్‌లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సేంద్రీయ విధానంలో వరి సాగు చేస్తాం. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. వాతావరణం కూడా అనుకూలించి, దిగుబడి పెరిగితే వ్యవసాయం లాభమే.

– బొప్పు శ్రీహరి, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, మానకొండూర్‌

విత్తనాలు ప్రభుత్వమే ఇవ్వాలి 
ఏటా నకిలీ, నాణ్యతలేని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే సబ్సిడీతో నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. అప్పుడే అన్నదాతలకు మేలు జరుగుతుంది.

– నర్సయ్య, రైతు, తీగలగుట్టపల్లి, కరీంనగర్‌

నీటి ఎద్దడి లేదు
ఏరువాక పౌర్ణమి రోజు రైతులందరం వ్యవసాయ పనిముట్లు, భూదేవికి, ఏడ్లకు పూజలు చేస్తాం. నాగలి కట్టి దుక్కులు దున్నడం ప్రారంభిస్తాం. వ్యవసాయానికి సాగునీటి ఎద్దడి లేకపోవడం సంతోషం. వర్షాలు అనుకున్నట్లు పడితే సాగుకు ఢోకా ఉండదు.  

– గంగాచారి, రైతు, చింతకుంట,కరీంనగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top