
దసరా సందర్భంగా ఆర్టీసీ బొనాంజా
లక్కీ డ్రా ద్వారా ముగ్గురికి నగదు నజరానా
నిర్ణీత తేదీల్లో ప్రయాణించే వారికే అవకాశం
షాద్‌నగర్: దసరా సందర్భంగా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారా.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారా.. అయితే మీరు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందించాలని నిర్ణయించింది.
నేటి నుంచి అక్టోబర్ 6 వరకు
ఈనెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగర్జీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందించనున్నారు. నిర్ణయించిన బస్సుల్లో ప్రయాణించే వారు బస్సులో తీసుకున్న టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి బస్సుల్లో, బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి.
అక్టోబర్ 10న లక్కీ డ్రా
అధికారులందరి సమక్షంలో అక్టోబర్ 10న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. రీజియన్ పరిధిలో లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నారు.
ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు అధికంగా ప్రయాణించే ప్రాంతాలకు అదనపు బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో పలు డిపోల్లో అదనపు సరీ్వసులు తిరుగుతున్నాయి.