హ్యామ్ రహదారుల టెండర్లలో కాంట్రాక్టర్ల రింగు 14 నుంచి ఏకంగా 75% అధికంగా బిడ్లు
రూ.18 వేల కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి సర్కారు నిర్ణయం
రెండు శాఖల పరిధిలో ప్యాకేజీల వారీగా టెండర్లకు ఆహ్వానం
ఆర్ అండ్ బీలో 34 ప్యాకేజీలు,పంచాయతీరాజ్‌లో 17 ప్యాకేజీలు
సాంకేతిక, ఆర్థిక బిడ్లు తెరిచి ప్రభుత్వానికి నివేదించిన శాఖలు
పలు ప్యాకేజీలకు ఎల్–1లుగా నిలిచిన సంస్థలన్నీ ఎక్కువ మొత్తాలకే టెండర్లు దాఖలు చేసిన వైనం
ఎక్సెస్ టెండర్లతో రూ.3000 కోట్లకు పైగా అదనపు భారం.. కొన్ని ప్యాకేజీలకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో ఎక్సెస్ టెండర్లు దాఖలు చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు పలు ప్యాకేజీల కింద టెండర్లు పిలవగా.. దాదాపు రూ.18 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు గాను కాంట్రాక్టు సంస్థలు కనీసం 14 శాతం నుంచి ఏకంగా 50 శాతం వరకు ఎక్కువగా టెండర్లు దాఖలు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్ అయి ఈ విధంగా ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ ప్యాకేజీల కింద లోయస్ట్ బిడ్ (ఎల్–1) దాఖలు చేసిన కాంట్రాక్టర్లకే ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఈ టెండర్లను కట్టబెడితే అంచనాల కంటే అధికంగా ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఖజానాపై రూ.3 వేల కోట్లకు పైగా భారం పడుతుందని స్పష్టమవుతోంది. రహదారులు, భవనాల శాఖ కింద రోడ్ల నిర్మాణానికి గాను 34 ప్యాకేజీలకు, పంచాయతీరాజ్ శాఖ కింద 17 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు.
ఆర్‌అండ్‌బీలో సగటున 21.69% ఎక్సెస్
ఆర్‌అండ్‌బీ శాఖ కింద మొత్తంగా 6,092 కిలోమీటర్ల రోడ్ల పనులను మొత్తం 34 ప్యాకేజీలుగా (రూ.12,176.53 కోట్లు) విభజించి టెండర్లు పిలిచారు. అందులో 31 ప్యాకేజీలకు సాంకేతిక, ఆర్థిక బిడ్లను తెరిచారు. ఎల్–1 కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. మొత్తం 31 ప్యాకేజీల బిడ్ ప్రాజెక్టు కాస్ట్ (బీపీసీ) రూ.11,018.92 కోట్లు కాగా.. ఎల్–1లుగా నిర్ధారించిన కాంట్రాక్టర్లు 21.69 శాతం అధికంగా మొత్తం విలువ రూ.13,408.98 కోట్లుగా కోట్ చేశారు. ఈ ప్యాకేజీల్లో ఒకటైన సిద్దిపేట బీపీసీ విలువ రూ.430. 38 కోట్లు కాగా.. కీస్టోన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏకంగా రూ.753.16 కోట్లు అంటే 75 శాతం ఎక్సెస్‌కు టెండర్ దాఖలు చేసి ఎల్–1 నిలిచింది. రూరల్ సర్కిల్ హైదరాబాద్–2 ప్యాకేజీ బీపీసీ రూ. 300.42 కోట్లు కాగా అనూషా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.459 కోట్లకు బిడ్ వేసింది. అంటే 52.79 శాతం ఎక్సెస్‌కు బిడ్‌ను దాఖలు చేసింది. ఈ విధంగా అన్ని ప్యాకేజీల్లోనూ ఎక్సెస్ టెండర్లు దాఖలు కావడం గమనార్హం. మరో మూడు బిడ్లు (విలువ రూ.1157.61 కోట్లు) ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని తిరస్కరించారు.
పంచాయతీరాజ్‌లో 22.10% ఎక్కువగా..
పంచాయతీరాజ్ శాఖలో మొత్తం 17 ప్యాకేజీలకు రూ.6,294 కోట్లతో టెండర్లు పిలిచారు. వీటిల్లో 11 ప్యాకేజీలకు సంబంధించి టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను ఆ శాఖ దాదాపు ఓకే చేసింది. ఎల్–1లుగా వచ్చిన కాంట్రాక్టు సంస్థల జాబితాను కూడా రూపొందించింది. ఈ 11 ప్యాకేజీల విలువ రూ.3,979.19 కోట్లు కాగా ఎల్–1లుగా నిలిచిన కాంట్రాక్టు సంస్థలు సగటున 22.10 శాతం ఎక్సెస్ (రూ.4,858.46 కోట్లు)తో టెండర్లు దాఖలు చేసినట్లు ఉన్నతాధికారులు రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. అంటే రూ.900 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్న మాట. ఈ 11 ప్యాకేజీల్లో 8 ప్యాకేజీలకు ఒకే కంపెనీ జె.ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ ఎల్–1గా వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఆరు ప్యాకేజీలకు (రూ. 2,315 కోట్ల పనులు) రీ టెండర్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించి ప్రభుత్వానికి నివేదించారు.
అసలు హ్యామ్ అంటే..
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే రహదారి నిర్మాణానికి రూ.100 కోట్లు వ్యయం అవుతుందనుకుంటే.. అందులో 40 శాతం నిధులను అంటే రూ.40 కోట్లు ప్రభుత్వం రహదారి నిర్మాణ సమయంలో నాలుగు దశల్లో చెల్లిస్తుంది. మిగిలిన రూ.60 కోట్లను కాంట్రాక్టర్ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని నిర్మించాల్సి ఉంటుంది. అయితే ఈ రూ.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో సహా 15 ఏళ్లల్లో ఆ కాంట్రాక్టరకు చెల్లిస్తుంది. ఈ పదిహేనేళ్లపాటు ఆ రహదారి నిర్వహణ బాధ్యతను సదరు కాంట్రాక్టరే నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌తో పాటు బిల్ట్ ఓన్ అండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో పూర్తి చేస్తారు. రోడ్ల అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే వాటిని నాలుగు లేన్లుగా, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేవి రెండు లేన్లుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే రహదారులను మరింత పటిష్ట పర్చాలని, అవసరమైన చోట బీటీ రహదారులుగా మార్చాలని, మండల కేంద్రానికి అనుసంధానించే రహదారుల్లో మట్టి, కంకరతో ఉన్న వాటిని బీటీతో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్..
కాంట్రాక్టర్లకు పనులు పారంభించేందుకు గాను వారికి కేటాయించిన పని విలువలో 10 శాతం మేరకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 18 వేల కోట్ల పనులకు గాను 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద దాదాపు రూ. 1,800 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దశల వారీగా పనులు చేపడుతున్నప్పటికీ ఈ మొత్తాన్ని ముందుగా వారికి చెల్లించాల్సిందే.


