బర్త్‌ డే స్పెషల్‌: ఓ సాహితీవేత్త.. రాజకీయ దురంధరుడు

CM KCR Birthday Celebrations: unknown facts - Sakshi

అరవై ఏళ్ల కల.. కోట్ల మంది ఆశయం.. ఎంతో ప్రాణత్యాగాల ఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. సుదీర్ఘ కాలం పాటు సాగుతున్న ఉద్యమానికి ఊపిరి పోసి ఎట్టకేలకు మలిదశలో స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దానికి మార్గం వేసినది కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. రాష్ట్రం కోసం పోరాడి దాన్ని సాధించి అదే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కేసీఆర్‌కే చెల్లింది. ఫిబ్రవరి 17వ తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా కేసీఆర్‌ జీవితంలోని కొన్ని ప్రధాన ఘట్టాలు తెలుసుకోండి.

  • జననం 17 ఫిబ్రవరి, 1954. స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకగా పేర్కొంటారు. కానీ వారి పూర్వీకులది చింతమడక కాదు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో వారి భూమి కోల్పోవడంతో చింతమడకకు వలస వచ్చారు. అందుకే జలాశయాల కోసం భూ సేకరణ జరిగినప్పుడుల్లా తాము భూ నిర్వాసితులమేనని కేసీఆర్‌ చాలాసార్లు గుర్తు చేశారు.
  • కేసీఆర్‌‌కు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు.
  • సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ డిగ్రీ పట్టా పొందారు.
  • కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ ప్రవేశం.  మెదక్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా మారారు.
  • పదిహేన్నేళ్ల వయసులో.. 1969, ఏప్రిల్‌ 23న శోభతో వివాహం.
  • ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు. అయితే అదే విశ్వవిద్యాలయ శత వసంతాల వేడుకలను పూర్వ విద్యార్థి అయిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించడం విశేషం.
  • కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ. తరచూ యాగాలు చేస్తుంటారు. అందుకే దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించారు. యాదాద్రిని అద్భుత రీతిలో తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేస్తున్నారు.
  • తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గకు ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించినట్లు కేసీఆర్‌ తెలిపారు.
  • కేసీఆర్‌కు ఎన్టీఆర్, అమితాబ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారు.
  • ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం.
  • పుస్తక ప్రియుడు. సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. ఓల్గా నుంచి గంగ వరకు ఎన్నెన్నో పుస్తకాలను చదివినట్టు ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్‌ చేయడం ఆయనకో సరదా.
  • నిత్యం అన్ని పత్రికలు చదివాకే పనిలోకి వెళ్తారు. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలు ఆసక్తిగా తెలుసుకుంటారు.
  • రాజకీయ తొలి గురువు మదన్ మోహన్. గురువుపైనే పోటీ చేసి కేసీఆర్‌ గెలిచారు.
  • కూతురు కవిత అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్టం. కవిత పుట్టాకే రాజకీయాల్లో కలిసొచ్చిందని గట్టి నమ్మకం. అందుకే విదేశాల్లో ఉన్న కవితను పిలిపించారు. ఆమెను నిజామాబాద్‌ ఎంపీగా పోటీలో నిలిపి గెలిపించేలా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీని చేశారు.
  • 1975లో రాజకీయాల్లో బిజీ అయి కుమారుడు కేటీఆర్ తొట్టెల వేడకకు కేసీఆర్‌ ఇంటికి కూడా వెళ్లలేదు.
  • ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టినా చిన్నపిల్లలకు ఇచ్చే కిట్‌కు మాత్రమే కేసీఆర్‌ తన పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు ‘కేసీఆర్‌ కిట్‌’ ఇస్తున్నారు. 
  • స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా నవంబర్‌ 29న నుంచి డిసెంబర్‌ 9వ తేదీ వరకు పది రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ‘ఆ పది రోజులు మానేసిన అన్నం బువ్వ ప్రజలకు బోనంకుండలో బెల్లం బువ్వ అయ్యింది’ అని కవులు పాటలు పాడారు.
  • కేసీఆర్‌కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడి ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్‌ స్టైల్‌.
  • కేసీఆర్‌ ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో పాడిన పద్యాలు.. కవితలు.. పాటలు, డైలాగ్స్‌ ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి.

    ఆసరాతో ఆప్తుడయ్యాడు..
    రైతుబంధుతో బంధువయ్యాడు..
    రైతుబీమాతో భోజుడయ్యాడు..
    కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో మేనమామయ్యాడు..   
    కేసీఆర్ కిట్ తో తాతయ్యాడు..
    మిషన్ భగీరథ, కాకతీయతో జలాధీశుడయ్యాడు
    నిరంతర విద్యుత్తుతో వెలుగులు వెదజల్లుతున్నాడు..
    కాళేశ్వరంతో జలసిరులు కురిపించాడు..
    స్వరాష్ట్రం తెచ్చాడు.. స్వర్ణకాంతులు వెలిగిస్తున్నాడు..
    ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు
    తెలంగాణ యోధుడా అందుకో ఈ శుభాకాంక్షలు

    (సోషల్‌ మీడియాలో వచ్చిన కవిత)

రాజకీయం జీవితంలో ప్రధాన ఘట్టాలు

  • సిద్ధిపేట‌లోని రాఘ‌వ‌పూర్ ప్ర‌ధాన వ్య‌వ‌సాయ కో-ఆప‌రేటిప్ సొసైటీకి చైర్మ‌న్‌గా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు.
  • తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రారంభించడంతో కాంగ్రెస్‌ను వదిలి వచ్చేశారు. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
  • 1989, 1994, 1999, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక.
  • తొలిసారిగా 1987-88లో మంత్రి అయ్యారు.
  • 1989-1993 వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా కొన‌సాగారు.
  • 1999లో ఆంధ్రప్రదేశ్‌ ఉప శాసన సభాపతిగా ఉన్నారు.
  • 1999లో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఈ అసంతృప్తి టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు దారి తీసింది.
  • చంద్రబాబు తీరుకు నిరసనగా 2001 ఏప్రిల్‌ 21న డిప్యూటీ స్పీకర్‌ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 
  • అనంతరం ఏప్రిల్‌ 27న ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు.
  • 2003లో న్యూ స్టేట్స్ నేష‌న‌ల్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టారు.
  • 2004 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీ చేశారు. కరీంనగర్‌ నుంచి ఎంపీగా విజయం.
  • యూపీఏ-1 హయాంలో 2004-06 కాలంలో తొలిసారి కేంద్ర మంత్రి.
  • తెలంగాణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ 2006లో యూపీఏ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర మంత్రిగా, కరీంనగర్‌ ఎంపీగా రాజీనామా చేశారు. అనంతరం జరిగిన కరీంనగర్‌ ఉప ఎన్నికలో కేసీఆర్‌ రెండు లక్షల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు.
  • 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో కొట్లాడారు.
  • 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్ష చేసి పది రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నారు. డిసెంబర్‌ 9న కేంద్రం ప్రకటనతో దీక్ష విరమించారు.
  • జూన్ 2, 2014న ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ (గజ్వేల్‌ ఎమ్మెల్యే) బాధ్యతలు చేపట్టారు.
  • 2018 సెప్టెంబ‌ర్ 6వ తేదీన అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top