
వైద్యుడిపై పోలీసులకు బాలుడి తండ్రి ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లాలో ఘటన
నారాయణఖేడ్: ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఓ బాలుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం శెల్గిర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బేగరి లక్ష్మణ్ రెండో కుమారుడు ప్రశాంత్ (14)కు ఈనెల 17వ తేదీన దగ్గు, జ్వరం రావడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు యూనుస్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన రెండు ఇంజెక్షన్లు, మందు గోలీలు ఇచ్చి ఇంటికి పంపించారు. జ్వరం తగ్గకపోవడంతో 18వ తేదీన మళ్లీ తీసుకువెళ్లగా సెలైన్ పెట్టి ఇంటికి పంపించారు.
అయితే ఫలితం లేకపోవడంతో 19వ తేదీన మళ్లీ ఆయన వద్దకే తీసుకెళ్లగా ఇన్‌ఫెక్షన్ అయిందని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో మెరుగైన చికిత్స కోసం బీదర్‌కు తీసుకు వెళుతుండగా మార్గమధ్యలో తన కొడుకు మృతి చెందాడని తండ్రి లక్ష్మణ్ తెలిపారు.
ఆర్‌ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తన కుమారుడు మృతి చెందాడని, అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని లక్ష్మణ్ మనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై కోటేశ్వరరావు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పది రూపాయల నాణెం గొంతులో ఇరుక్కొని...
అస్వస్థతకు గురై విద్యార్థిని మృతి
భూదాన్‌పోచంపల్లి: రూ.10 కాయిన్ గొంతులో ఇరు క్కొని ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అస్వస్థతకు గురై ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో చోటుచేసుకొంది. భీమనపల్లి గ్రామానికి చెందిన శేఖర్, జ్యోతి దంపతుల కుమార్తె నిహారిక (11) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది.
ఈ నెల 18న సాయంత్రం పొరపాటున రూ.10 కాయిన్ నోట్లో వేసుకొంది. అది గొంతులో ఇరుక్కోవడంతో వెంటనే తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు అదేరోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు కాయిన్‌ను తొలగించారు. మరుసటి రోజు శుక్రవారం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఆరోగ్యంగా కనిపించిన నిహారిక రోజుమాదిరిగానే రాత్రి నిద్రపోయింది.
శనివారం ఉదయం తల్లిదండ్రులు నిహారికను లేపడానికి ప్రయత్నించగా ఎలాంటి స్పందనాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే నిహారికను తిరిగి అదే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు చెప్పారు. అయితే డాక్టర్లు అనస్థీషియా డోసు ఎక్కువ ఇవ్వడం వల్లనే నిహారిక కోమాలోకి వెళ్లిందని, డాక్టర్ల నిరక్ష్యం వల్లనే తన కుమార్తె మృతిచెందిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.