బీసీ విద్యార్థుల 10 వేల లోపు ర్యాంకు సీలింగ్ సడలింపుపై కసరత్తు
ఈఏపీసెట్, ఇతర సెట్‌ల ర్యాంకు పరిమితిని డబుల్ చేసే యోచనలో ప్రభుత్వం
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ర్యాంకు నిబంధనతో బీసీ విద్యార్థులకు ఇబ్బందులు
నిబంధనలు సడలించాలని సంఘాల విన్నపాలు.. ఒత్తిళ్లు సడలింపు ప్రతిపాదనలు పరిశీలిస్తున్న బీసీ సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిబంధనల సడలింపుపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది. ఇప్పటివరకు ఈఏపీసెట్‌లో కేవలం 10 వేల లోపు ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తోంది. పాలీసెట్‌తో పాటు వివిధ సెట్లకు సంబంధించి కేవలం వెయ్యిలోపు ర్యాంకు సాధించిన వారు మాత్రమే పూర్తిస్థాయి ఫీజుకు అర్హత సాధిస్తారు. ఈ నిబంధన బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఇబ్బందికరంగా మారుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రారంభించినప్పుడు ర్యాంకు సీలింగ్ నిబంధన లేనప్పటికీ... 2010 తర్వాత సీలింగ్ విధించడంతో బీసీ విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు వెనకడుగు వేస్తున్నారని, ఈ నిబంధనను ఎత్తేయాలని బీసీ సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలుమార్లు ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన బీసీ సంఘాల నేతలు ర్యాంకు పరిమితిని ఎత్తివేయాలని కోరడంతో పాటు స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టడంతో ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆ మిగిలిన మొత్తం విద్యార్థులు చెల్లించాల్సిందే..
ప్రస్తుతం ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో చేరే 10 వేల లోపు ర్యాంకు బీసీ విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజును పూర్తిస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఆపై ర్యాంకు వారికి మాత్రం కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు ఏటా రూ.1 లక్షకు పైబడి ఉంటే కొన్ని కాలేజీల్లో రూ.1.6 లక్షల వరకు ఉంది. అయితే 10 వేల ర్యాంకు దాటిన బీసీ విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరితే కేవలం రూ.35 వేల ఫీజు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. మిగిలిన ఫీజును విద్యార్థి వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్, ఇంజనీరింగ్ కోర్సులో లాటరల్ ఎంట్రీకి సంబంధించి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పలు సెట్‌లలో ర్యాంకు పరిమితిని వెయ్యిగా ఖరారు చేశారు. దీనికి మించి ర్యాంకు వచ్చిన వారంతా ప్రభుత్వమిచ్చే సాయం పోను మిగిలిన మొత్తాన్ని విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మాత్రం ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల ఒత్తిడి మేరకు సంబంధిత నిబంధనల సడలింపుపై కసర్తు జరపాల్సిందిగా మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు.
ప్రతిపాదనలపై కసరత్తు...
ప్రస్తుతం ఈఏపీసెట్‌కు సంబంధించి ఉన్న ర్యాంకు పరిమితిని 10 వేల నుంచి 20 వేలకు పెంచడంతో పాటు ఇతర సెట్‌లకు సంబంధించి ప్రస్తుతమున్న ర్యాంకు సీలింగ్‌ను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచే విధంగా పరిశీలన చేయాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. అలా ర్యాంకు పరిమితిని పెంచడంతో ప్రభుత్వంపై పడే భారాన్ని కూడా లెక్కంచి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు బిజీ అయ్యారు. ఒకట్రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించనున్నారు. వీటిని సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించిన తర్వాత సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.


