India Service Charges: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జీలపై నిషేధం

Ban on service charges in hotels and restaurants - Sakshi

అవి స్వచ్ఛందమే

సీసీపీఏ మార్గదర్శకాలు

ఆటోమేటిక్‌గా వసూలు చేయడానికి వీల్లేదని ఆదేశాలు

ఫిర్యాదుల కోసం 1915 హెల్ప్‌లైన్‌ నంబరు, ఎన్‌సీహెచ్‌ యాప్‌

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జీల వడ్డింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇకపై సర్వీస్‌ చార్జీలను విధించడాన్ని, బిల్లుల్లో ఆటోమేటిక్‌గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. సర్వీస్‌ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ సోమవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘సర్వీస్‌ చార్జీ అనేది స్వచ్ఛందమేనని కస్టమర్లకు చెప్పకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లు దాన్ని బిల్లులో ఆటోమేటిక్‌గా చేరుస్తున్నాయని ఫిర్యాదులు మా దృష్టికొచ్చాయి.

మెనూ లో చూపే ఆహార ఉత్పత్తుల ధరలు, వాటికి వర్తించే పన్నులకు అదనంగా ఏదో ఒక ఫీజు లేదా చార్జీ ముసుగులో అవి దీన్ని విధిస్తున్నాయి. ఏ హోటలూ లేదా రెస్టారెంటూ బిల్లులో సర్వీస్‌ చార్జీని ఆటోమేటిక్‌గా చేర్చకూడదు. దాన్ని చెల్లించాలంటూ కస్టమరును బలవంతపెట్టకూడదు. ఇది స్వచ్ఛందమైనది, ఐచ్ఛికమైనది మాత్రమేనని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలి’ అని పేర్కొంది. అలాగే, సర్వీస్‌ చార్జీ వసూలు ప్రాతిపదికన లోపలికి ప్రవేశం విషయంలో గానీ సేవలు అందించడంలో గానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది.

ఆహారం బిల్లులో సర్వీస్‌ చార్జీని చేర్చడం, ఆ తర్వాత మొత్తంపై జీఎస్‌టీని వసూలు చేయడం వంటివి సరికాదని సీసీపీఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ మార్గదర్శకాలతో పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హోటల్, రెస్టారెంట్‌ అసోసియేషన్స సమాఖ్య ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌ గురుబక్షీష్‌ సింగ్‌ కొహ్లి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేస్తామని, తమ రంగాన్ని మాత్రమే వేరుగా చేసి చూడవద్దని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్‌ బిల్లు మొత్తంపై 10 శాతం సర్వీస్‌ చార్జీని వసూలు చేస్తున్న నేపథ్యంలో సీసీపీఏ మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఫిర్యాదులు ఇలా..
ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంటు సర్వీస్‌ చార్జి విధించిన పక్షంలో, బిల్లు మొత్తం నుంచి దాన్ని తొలగించాలంటూ సదరు సంస్థను కస్టమరు కోరవచ్చు. అయినప్పటికీ ఫలితం లేకపోతే నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) నంబరు 1915కి లేదా ఎన్‌సీహెచ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సత్వర పరిష్కారం కోసం ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలో ఈ–దాఖిల్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారుల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే విచారణ, చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టరును కూడా ఆశ్రయించవచ్చు. సీసీపీఏకి ఈ–మెయిల్‌ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చు. 

సీసీపీఏ మార్గదర్శకాల్లో మరిన్ని వివరాలు..
► రెస్టారెంట్లు లేదా హోటళ్లు ఆహారం, పానీయాలను అందించడంలో సర్వీసు కూడా భాగంగానే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయా ఆహార, పానీయాల ధరలు ఉంటాయి. వాటిని ఏ రేటుకు అందించాలనేది నిర్ణయించుకోవడంలో హోటళ్లు లేదా రెస్టారెంట్లపై ఎటువంటి ఆంక్షలు లేవు. 

► వినియోగదారుకు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు మధ్య కుదిరిన కాంట్రాక్టు ప్రకారం కనీస స్థాయికి మించి సర్వీసులను పొందిన పక్షంలో కస్టమరు తన విచక్షణ మేరకు టిప్‌ ఇవ్వొచ్చు. ఇది కస్టమరుకు, హోటల్‌ సిబ్బందికి మధ్య ప్రత్యేకమైన వేరే లావాదేవీ అవుతుంది. తను భుజించిన తర్వాత మాత్రమే ఆహార నాణ్యత, సర్వీసుపై కస్టమరు ఒక అవగాహనకు రాగలరు. ఆ తర్వాత టిప్‌ ఇవ్వొచ్చా, లేదా.. ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వాలి అన్నది నిర్ణయించుకోగలుగుతారు. అంతే తప్ప రెస్టారెంట్లో ప్రవేశించినంత మాత్రాన లేదా ఆర్డరు చేసినంత మాత్రాన కస్టమరు టిప్‌పై నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి కట్టాలా లేదా అనేది నిర్ణయించుకోవడంలో కస్టమరుకు ఎటువంటి అవకాశమూ ఇవ్వకుండా బిల్లులో ఏకపక్షంగా సర్వీస్‌ చార్జీని విధించడానికి వీల్లేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top