
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
హయత్‌నగర్‌లో డీసీఎంను ఢీకొట్టిన కారు
ముగ్గురు యువకుల మృతి
కర్ణాటకలోట్రావెల్స్ బస్సును ఢీకొన్న కారు
కెనరా బ్యాంక్ మేనేజర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె మృతి
హయత్‌నగర్ (హైదరాబాద్)/గద్వాల క్రైం: బుధవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతిచెందారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కరే మగపిల్లలు కాగా, కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ మృత్యుఒడికి చేరారు.
విషాదం మిగిల్చిన అతివేగం..
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో అతి వేగం నాలుగు కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్‌రెడ్డి (24), చుంచు వర్షిత్‌రెడ్డి (23), ఎలిమేటి పవన్‌కల్యాణ్‌రెడ్డి చిన్నప్పటినుంచి స్నేహితులు.

బుధవారం తెల్లవారుజామున వారంతా పస్మాముల వైపు నుంచి కుంట్లూర్‌కు స్కోడా కారులో వస్తున్నారు. ఉదయం 5:40 గంటల సమయంలో కుంట్లూర్‌లోని నారాయణ కళాశాల సమీపంలోని గ్యాస్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న చంద్రసేనారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ పవన్‌కల్యాణ్‌రెడ్డిని కారులో నుంచి బయటికి తీసిన పోలీసులు చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు.
కాగా, మంగళవారం రాత్రి ఓ రిసెప్షన్‌కు హాజరైన ఈ యువకులు మధ్యలో ఓ ఫాంహౌస్‌లో గడిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు మృతి చెందగా, డ్రైవర్‌సీటు పక్కన కూర్చున్న పవన్‌కల్యాణ్‌రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. అతను సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ ఓపెన్ అయినట్లు పోలీసులు తెలిపారు.
వారసులను కోల్పోయిన కుటుంబాలు...
పిన్నింటి చంద్రసేనారెడ్డి, చుంచు త్రినాథ్‌రెడ్డి, చుంచు వర్షిత్‌రెడ్డి వారి కుటుంబాల్లో ఒకరే మగపిల్లలు. వీరిలో త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అన్నదమ్ముల కుమారులు. వారిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో తమకు వారసులు లేకుండా పోయారని, చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా మృతిచెందారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఒకే కుటుంబంలో నలుగురు మృతి..
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్ (41) మహారాష్ట్రలో కెనరా బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి ప్రాంతం నుంచి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. దీంతో బుధవారం భార్య పవిత్ర (38), కుమార్తె జ్యోత్స్న (10), కుమారులు అభిరాం (8), ప్రవీణ్‌తో పాటు కర్ణాటకకు చెందిన డ్రైవర్ శివప్ప (45)తో కలిసి కారులో బయల్దేరారు.
ఈ క్రమంలో కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో సోలాపూర్– చిత్రదుర్గ హైవేపై వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో కారు తుక్కుతుక్కు కాగా అందులో ఉన్న భాస్కర్, పవిత్ర, జ్యోత్స్న, అభిరాం, డ్రైవర్ శివప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడిన ప్రవీణ్ కుటుంబసభ్యులను కోల్పోయి అనాథగా మిగిలాడు.