తమిళసినిమా: ఏస్ డైరెక్టర్‌గా పేరు గాంచిన దర్శకుడు మణిరత్నం. ఇంతకు ముందు ఈయన పట్టిందల్లా బంగారం అన్నట్టుగా చేసిన చిత్రాలన్నీ సంచలన విజయాలను సాధించాయి. ఇంకా చెప్పాలంటే ఆ మధ్య విడుదలైన పొన్నియిన్ సెల్వన్ 1,2 వంటి చారిత్రక కథా చిత్రాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఇక ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించడంలో మణిరత్నంది ప్రత్యేక శైలి. ఇందుకు చిన్న ఉదాహరణ ముంబాయి, ఓ కణ్మణి వంటి చిత్రాలే. అలాంటి గొప్ప దర్శకుడు ఇటీవల కమలహాసన్, శింబు, త్రిష వంటి ప్రముఖ నటీనటులతో రూపొందించిన థక్ లైఫ్ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో మణిరత్నం తాజాగా ఒక యూత్ ఫుల్ లవ్‌స్టోరీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో నటుడు విజయ్ సేతుపతి, నటి సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిండానికి రెడీ అవుతున్నారు. బహుభాషా నటీనటులుగా రాణిస్తున్న ఈ జంట తొలిసారి ఈ చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఇండియా టొకీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కాగా మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రొడక్షన్స్ నెంబర్ 23 అనే. తాత్కాలిక పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికీ ముమ్మరంగా జరుగుతున్నాయని తాజా సమాచారం. కాగా చిత్ర షూటింగ్ మే నెల 14 వ తేదీన ప్రారంభం కానున్నట్లు తాజా అప్ డేట్.కాగా ఈ క్రేజీ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.


