కాహోకాన్‌ ఆరోగ్య సదస్సు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కాహోకాన్‌ ఆరోగ్య సదస్సు ప్రారంభం

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

సాక్షి, చైన్నె : నందంబాక్కం వర్తక కేంద్రం వేదికగా కాహోకాన్‌ అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సదస్సు శనివారం ప్రారంభమైంది. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల ఈ సదస్సులో వైద్య సేవలకు గుర్తింపుగా కాహో అవార్డులను ప్రదానం చేయనున్నారు. కన్సార్టియం ఆఫ్‌ అక్రిడిటెడ్‌ హెల్త్‌కేర్‌ ఆర్గనైజేషన్స్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటుగా ఈ సదస్సు జరగనుంది.

వైద్య రంగంలో మార్పులు రావాలి

ఈసదస్సులో ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం ఉచితంగా అందేలా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వైద్యం కోసం ప్రజలు తమ సొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావడం ఆందోళనకరమన్నారు, ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించవచ్చనని సూచించారు. వైద్యులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెనన్స్‌ వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, నివారణా వైద్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి , అంతర్జాతీయ ఆరోగ్య నాణ్యత నిపుణుడు డాక్టర్‌ ఎజెకియల్‌ గార్సియా ఎలోరియోలు సదస్సులో ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకు 200 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు సుమారు 2,500 మంది ఆరోగ్య రంగ నిపుణులు హాజరయ్యారు. 150కి పైగా స్టాళ్లతో కూడిన ఎగ్జిబిషన్‌లో నూతన వైద్య పరికరాలు, డిజిటల్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ను ప్రదర్శించారు. వైద్య రంగంలో మేనేజ్‌మెంట్‌ విధానాలను ప్రోత్సహించడానికి ఐఐఎం జమ్మూతో కాహో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఫార్మసీ, రిహాబిలిటేషన్‌, పేషెంట్‌–ఫ్రెండ్లీ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో కొత్త ప్రమాణాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కాహో అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌ అగర్వాల్‌, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ లల్లు జోసెఫ్‌, ఆర్గనైజింగ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ నల్ల జి పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, నాణ్యమైన వైద్య సేవలు అందించిన సంస్థలకు ఈ వేదికపై ’కాహో అవార్డులు’ ప్రదానం చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement