కారైకుడిలో విజయ్‌ మౌన ప్రచారం | - | Sakshi
Sakshi News home page

కారైకుడిలో విజయ్‌ మౌన ప్రచారం

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

● ఆలస్యంగా రాకతో ప్రసంగానికి చెక్‌ ● రోడ్‌షోతో పలకరింపు

సాక్షి, చైన్నె : శివగంగ జిల్లా కారైకుడిలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ ప్రసంగానికి ఆలస్యం బ్రేక్‌ వేసింది. నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా రావడంతో ఆయన ప్రచారానికి పోలీసులు చెక్‌ పెట్టారు. దీంతో రోడ్‌ షో రూపంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ శుక్రవారం విజయ్‌ ముందుకుసాగారు.

శివగంగ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు విజయ్‌ శుక్రవారం ఉదయం చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారైకుడికి బయలుదేరారు.

జన కెరటం

విజయ్‌ను చూసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచే ఆ పరిసరాలకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కేడర్‌, విజయ్‌ను చూడాలన్న ఆశతో సాధారణ ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఆ పరిసరాలన్నీ ఇసుక వేస్తే రాలనంతగా పరిస్థితి నెలకొంది. జనసందోహం దృష్ట్యా, బస్టాండ్‌ను సైతం సాయంత్రం వరకు మూసి వేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. విజయ్‌ రాక ఆలస్యమయ్యే కొద్ది టెన్షన్‌ బయలు దేరింది. ఓ వైపు భానుడు భగ భగమని ప్రతాపం చూపిస్తున్నా, విజయ్‌ రాక కోసం అభిమానులు నిరీక్షించారు. నిర్ణయించిన సమయానికి కంటే ఆలస్యంగా ఆయన కారైక్కుడి ప్రచార సభా పరిసరాలకు చేరుకున్నారు. దీంతో పోలీసులు మైక్‌ సెట్‌ ఉపయోగించేందుకు వీలులేదని స్పష్టం చేశారు. దీంతో విజయ్‌ ఓపెన్‌ టాప్‌ వాహనం పైకి ఎక్కి అభిమానులు, జనానికి అభివాదం తెలుపుతూ రోడ్‌షో రూపంలో ముందుకు సాగారు. విజయ్‌ను చూసిన ఆనందంలో జనం కేరింతలు కొట్టారు. అయితే, ఆయన ప్రసంగాన్ని వినలేకపోయామన్న నిరాశ తప్పలేదు. అయితే, అభిమానుల్లో ఉత్సాహం నింపే విధంగా నలుగురు అభ్యర్థును పరిచయంచేస్తూ కారైకుడిలో రోడ్‌ షో నిర్వహించిన విజయ్‌, టీవీకే అభ్యర్థులకు ఓట్లు వేయాలని కేవలం చేతి సైగలతోనే ప్రజలను కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, విజయ్‌ వాహనాన్ని వెంబడిస్తూ ద్విచక్ర వాహనాల్లో కిలోమీటర్ల కొద్దీ అభిమానులు దూసుకొచ్చారు. కొన్ని చోట్ల ఒకర్ని మరొకరు ఢీకొట్టుకుని కింద పడి ఆస్పత్రి పాలయ్యారు. కారైకుడి వైపుగా దూసుకెళ్తున్న విజయ్‌ కాన్వాయ్‌ని తిరుపత్తూరు వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆపేసింది. ఆయన వాహనాన్ని, వెన్నంటి వచ్చిన వాహనాన్ని తనిఖీల అనంతరం అనుమతించారు.

సైకిల్‌ యాత్రతో జాప్యం

మదురై నుంచి కారైకుడి వచ్చే మార్గమధ్యంలో అభిమానులు భారీగా తరలిరావడంతో వాహనం నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలో విజయ్‌ అకస్మాత్తుగా తన ప్రచార వాహనం దిగి, సిద్ధంగా ఉన్న సైకిల్‌పై ప్రయాణం ప్రారంభించారు. మదురై – కారైకుడి మధ్య ఉన్న 90 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి విజయ్‌కు 4 గంటలు సమయం పట్టింది. కారైకుడిలో మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే కొత్త బస్టాండ్‌ పరిసరాలలో విజయ్‌ ప్రచార సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, విజయ్‌ మధ్యాహ్నం 2.30 తర్వాత ప్రచార ప్రాంతానికి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement