●బీజేపీ విమర్శలు
సాక్షి, చైన్నె: డీఎంకే పార్టీలో తండ్రి, చెల్లి, కుమారుడు తర్వాత ఇప్పుడు అల్లుడిని కూడా ఎంపీని చేసి, ఒకే కుటుంబ ఆధిపత్యాన్ని శాశ్వతం చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎన్‌ఎస్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ రాజకీయాలపై ధ్వజమెత్తారు. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, కుల ధ్రువీకరణ పత్రం పొందాలన్నా కౌన్సిలర్లకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. సీఎం స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇప్పుడు బహిరంగంగానే రాజకీయాల్లోకి వచ్చారని, స్టాలిన్ ముఖ్యమంత్రిగా, ఆయన సోదరి ఎంపీగా, కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ క్రమంలో అల్లుడిని కూడా ఎంపీని చేయాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి పాలన నుంచి తమిళనాడును రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రసాద్ ఈసందర్భంగా పిలుపునిచ్చారు.
శశికళ వ్యాఖ్యలపై చర్చ
సాక్షి,చైన్నె : చిన్నమ్మ వీకే శశికళ చేసిన వ్యాఖ్యలు తాజాగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. శివగంగలో ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె పరోక్షంగా ఎడపాడి పళనిస్వామిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన వ్యక్తి (ఎడపాడి) నుంచే ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని శశికళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక నిరంకుశుడిలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. తాను జైలుకు వెళ్లినప్పటి నుంచి పార్టీలో (అన్నాడీఎంకే) అనేక సమస్యలు తలెత్తాయని, ఆ విషయాలన్నీ ప్రజలకు తెలుసని ఆమె పేర్కొన్నారు. తాను తిరిగి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు మారలేదని అన్నారు. తాను వీరమరణం పొందిన రాణి వేలు నాచియార్‌ను స్ఫూర్తిగా తీసుకుంటానని, తమిళనాడు ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని శశికళ తెలిపారు.
చైన్నె పోలీస్ కమిషనర్ బదిలీ
సాక్షి, చైన్నె: గ్రేటర్ చైన్నె పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్‌ను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. కొత్త కమిషనర్‌గా అభిన్‌దినేష్‌మోదక్‌ను నియమించారు. డీఎంకేకు అనుకూలంగా అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్టుగా ఆరోపణలను ప్రతిపక్షాలు వెల్లువెత్తిస్తున్న విషయం తెలిసిందే. టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీల ప్రతినిధులు పదే పదే ఎన్నికల కమిషన్‌ను సంప్రదిస్తూ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పలు జిల్లాల ఎస్పీలు, నగరాల కమిషనర్లు, కలెక్టర్లను ఇప్పటికే ఎన్నికల విధుల నుంచి తప్పించి, వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించారు. అలాగే, డీజీపీ(ఇన్‌చార్జ్) వెంకట్రామన్‌ను తప్పించి సందీప్ రాయ్‌రాథోర్‌ను నియమించారు. ఇక, రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంను సైతం తప్పించారు. ఆయన స్థానంలో ఎన్నికల కొత్త సీఎస్‌గా సాయికుమార్ నియమితులయ్యారు. ఈ పరిస్థితులలో గ్రేటర్ చైన్నె కమిషనర్ అరుణ్‌ను తప్పిస్తూ శుక్రవారం రాత్రి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అదనపు డీజీపీ హోదాలో ఉన్న అభిన్‌దినేష్‌మోదక్‌ను శనివారం చైన్నె కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
రూ.9కోట్ల బంగారం స్వాధీనం
తిరువళ్లూరు: చైన్నె, గిండి నుంచి తిరుత్తణి వైపు బొలెరో వాహనంలో వెళుతున్న రూ.9 కోట్ల విలువైన బంగారు బిస్కెట్‌లు, కడ్డీలను ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుని తిరువళ్లూరు ఆర్వోకు అప్పగించారు. తిరువళ్లూరు జిల్లాలో లక్ష్మాపురం వద్ద ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనంలో ఎలాంటి భద్రత లేకుండా తీసుకెళుతున్న రూ.9కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, కడ్డీలు, వెండి వస్తువులు, రూ.71 లక్షలు విలువ చేసే వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బంగారు నగలకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేకపోవడంతో వాటిని తిరువళ్లూరు ఆర్వోకు అప్పగించారు. కాగా అధికారుల విచారణలో బంగారు నగలను ప్రయివేటు దుకాణానికి తీసుకెళుతున్నట్టు నిర్ధారించి స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.


