–రక్షించే ప్రయత్నంలో మరో వ్యక్తి దుర్మరణం
అన్నానగర్: రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువతిని రక్షించే క్రమంలో ఓ వ్యక్తి, యువతి ఇద్దరు దుర్మరణం చెందారు. మరైమలై నగర్‌లోని సింగపెరుమాల్ ఆలయం సమీపంలో ఉన్న తాలి మంగళం గ్రామానికి చెందిన ఇళంగోవన్ (53). ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను బుధవారం ఉదయం మరైమలై నగర్ రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో 30 ఏళ్ల ఓ యువతి రైలు పట్టాల దగ్గర నిలబడి ఉంది. చైన్నె–ఎగ్మూర్ వైపు వెళుతున్న తిరుచెందూరు ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా పరుగులు తీసింది. ఇది చూసిన ఇళంగోవన్, ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆమె వద్దకు పరుగులు తీశాడు. రైలు వారిద్దరినీ ఢీకొంది. వారు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న తాంబరం రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతులిద్దరికీ ఒకరి కొకరు పరిచయం లేదని తెలిసింది. యువతి రైలు ఎదురుగా వెళ్లడం చూసి ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తి కూడా మృతిచెందాడు.
తిరువళ్లూరు: చెరుకు రైతులకు ప్రధాన ఆధారంగా వున్న తిరువేలాంగాడు షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ స్థానిక రైతులకు హమీ ఇచ్చారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో తిరువేలాంగాడు, వ్యాసాపురం, పళయనూర్‌తో పాటూ పలు గ్రామాల్లో రమణ విసృతంగా ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటూ రైతులకు అండగా వుంటానని హమీ ఇచ్చారు. తిరువేలాంగాడు షుగర్ ప్యాక్టరి ఆధునీకరణకు కృషి చేయడంతో పాటూ వరి రైతులను కోసం అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామనీ హమీ ఇచ్చారు. యువతకు శిక్షణతో కూడిన ఉపాధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
విల్లివాక్కంలో గొరిల్లా
సాక్షి, చైన్నె : చైన్నెలోని విల్లివాక్కం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా సాగింది. ఓటర్లను ఆకర్షించడానికి ఒక కార్యకర్త గొరిల్లా వేషం వేసుకుని రోడ్లపై పరుగులు తీస్తూ, ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లు అభ్యర్థించాడు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఈ వింత వేషధారణను చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. బైక్‌లపై వెళ్లేవారిని ఆపి మరీ ఆయన చేసిన చేష్టలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.


