తిరువళ్లూరు: డీఎంకే ప్రభుత్వం రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పది వేల మినీ బస్సులను కొనుగోలు చేసి మారుమూల గ్రామాలకు సైతం రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని డీఎంకే ఎంపీ కనిమెళి హామీ ఇచ్చారు. తిరువళ్లూరు డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్‌కు మద్దతుగా కనిమెళి కనకమ్మసత్రం వద్ద ప్రచారం నిర్వహించారు. కనిమెళి మాట్లాడుతూ రెండవసారి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది వేల మినీ బస్సులను కొనుగోలు చేయడంతోపాటు మారుమూల గ్రామాలకు బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ అడ్డుకట్ట వేస్తుందన్న ఆయన, గత ఐదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ద్రోహం చేసిందన్నారు. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉపాధీ హమీ పనుల ఎంపిక సైతం ఢిల్లీ చేతిలోకి వెళుతుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. గత ఐదేళ్లలో డీఎంకే హయాంలో 2,03,804 నేరాలు జరిగాయన్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుందన్న ఆరోపణలను నమ్మొద్దని, తాము అధికారంలోకి వస్తే ప్రజలు సుఖసంతోషాలతో జీవితాన్ని గడపవచ్చన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
తిరుత్తణిలో..
తిరుత్తణి: ఎన్నికల హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా ప్రజల వద్దకు వచ్చిన డీఎంకేను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి అన్నారు. తిరుత్తణి డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తికి మద్దతుగా తిరుత్తణి బైపాస్ రోడ్డు కూడలిలో మంగళవారం కనిమొళి ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో సైతం భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు సహా జనసందోహం నడుమ కనిమొళి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు రూ. వెయ్యి ఆర్థికసాయం అందజేస్తామని గత 2021లో డీఎంకే హామిని ఎడపాడి పళనిస్వామి హేళన చేశారని ఆ పథకం అమలుకు సాధ్యం కాదన్నారన్నారు. అయితే సీఎం స్టాలిన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రాష్ట్రంలో 1.31 కోట్ల మంది మహిళలకు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు, తెలిపారు. అయితే ప్రస్తుతం మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు. తమిళనాడు అభివృద్ధిని గాలికి వదిలి సవితి తల్లి ప్రేమ చూపిన బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ఇకపై అమిత్‌షా అన్నాడీఎంకేగా మారుతుందని తెలిపారు. ఎన్నికల తరువాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ద్రవిడ మాడల్ 2.0 పాలనకు ప్రజలు డీఎండీకే అభ్యర్ధిని గెలిపించాలని పిలుపునిచ్చారు.


