– దేవేంద్ర ఫడ్నవీస్‌పై డీఎంకే ఎంపీల ఆగ్రహం
సాక్షి, చైన్నె : తమిళనాడులో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీలు తీవ్ర స్థాయిలో మంగళవారం మండిపడ్డారు. తమ అభ్యర్థిని గెలిపిస్తేనే మెట్రో ప్రాజెక్టులు ఇస్తామని చెప్పడం ప్రజలను బెదిరించడమేనని వారు ధ్వజమెత్తారు. డీఎంకే ఎంపీలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇందులో దక్షిణ చైన్నె ఎంపి తమిళచ్చి తంగపాండియన్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
మెట్రో ప్రాజెక్టులపై రాజకీయం
మదురై, కోయంబత్తూరు మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ద్రావిడ మోడల్ ప్రభుత్వం అన్ని రాష్ట్ర స్థాయి పనులను 100 శాతం పూర్తి చేసిందని ఎంపీలు గుర్తుచేశారు. డీపీఆర్ సమర్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు.
జనాభా సాకుతో వివక్ష
2011 జనాభా లెక్కల ప్రకారం మధురై, కోయంబత్తూరు జనాభా 20 లక్షలు లేదని సాకు చూపుతూ కేంద్రం అనుమతులు నిరాకరించిందని మండిపడ్డారు. అంతకంటే తక్కువ జనాభా ఉన్న ఆగ్రా, పాట్నా నగరాలకు మాత్రం మెట్రో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇది తమిళులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఉన్న వివక్షకు నిదర్శనమని విమర్శించారు.
ఫడ్నవీస్‌పై విమర్శలు
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో అక్కడికి రావాల్సిన పెట్టుబడులను గుజరాత్‌కు తరలించిన వ్యక్తి ఫడ్నవీస్ అని, అటువంటి వ్యక్తి ఇప్పుడు మధురైలో మెట్రో తెస్తానని చెప్పడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు కేవలం స్థానిక ఎన్నికలు కావని, ఇది ‘ఢిల్లీకి – తమిళనాడుకు‘ మధ్య జరుగుతున్న యుద్ధమని వారు అభివర్ణించారు. కాగా,ఫడ్నవీస్ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ సైతం తన ఎక్స్ పేజీలో ఖండిస్తూ తీవ్రంగా మండిపడ్డారు.


