
హిట్ కాంబో రిపీట్?
తమిళసినిమా: ఒక సూపర్‌హిట్ చిత్రం తరువాత మళ్లీ అదే కాంబినేషన్‌లో చిత్రం వస్తుందంటే కచ్చితంగా ఆ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి కాంబో రిపీట్ కానుందనేది తాజా సమాచారం. ఇటీవల ఏ పత్రికలో చూసినా, సామాజిక మాధ్యమాల్లో చూసినా నటుడు విశాల్ పెళ్లి వార్తలే. ఆయన నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త ప్రత్యేకంగా మారింది. కాగా ఇప్పుడు విశాల్ తదుపరి చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విశాల్, దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో రూపొందిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సమీప కాలంలో తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ సుందర్.సీ దర్శకత్వంలో నటించనున్నట్లు విశాల్ ప్రకటించారు. అదే సమయంలో తన స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రాలేదు. కాగా తాజాగా విశాల్ తాజా చిత్రాన్ని పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబోలో ఇంతకు ముందు ఇరుంబుతిరై అనే సూపర్‌హిట్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మంచనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా విశాల్, దర్శకుడు పీఎస్.మిత్రన్ ల కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.