
నీట్ మరో విద్యార్థిని మింగేసింది!
● ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
సేలం: సేలంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థి ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. రాష్ట్రంలో నీట్ భయంతో బలన్మరణానికి పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నీట్ రద్దుకు పాలకులు ఆది నుంచి పట్టుపడుతున్నా ఫలితం శూన్యం. దీంతో మరో బలి దానం తప్పలేదు. సేలం నరసొత్తి పట్టి ప్రాంతానికి చెందిన రంగన్ మెకానిక్ వర్క్‌షాప్ నడుపుతున్నాడు. ఆయన కుమారుడు గౌతమ్ (21) గతంలో రెండుసార్లు నీట్ పరీక్షకు హాజరయ్యాడు. తగినన్ని మార్కులు సాధించకపోవడంతో అతను ప్రస్తుతం మూడోసారి నీట్ పరీక్ష రాశాడు. గౌతమ్ ఈ పరీక్ష సరిగ్గా రాయలేదని చెబుతూవచ్చాడు. కొన్ని రోజులుగా ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంట్లో విచారంగా ఉంటూ వచ్చాడు. ఈ పరిస్థితిలో సోమవారం రాత్రి, అతని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గౌతమ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. మంగళశారం ఈ విషయం తెలుసుకున్న సూరమంగళం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతదేహాన్ని శవపరీక్ష కోసం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్యాప్తులో, గౌతమ్ నీట్‌లో ఫెయిల్ అవుతానన్న భయంతో బలవన్మరణానికి పాల్పడినట్టు తేలింది. కాగా, నీట్ మరణాలు పెరుగుతుండడంతో విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక నైనా నీట్ రద్దుకు పాలకులు సరైన మార్గంలో పయనించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు డిమాండ్ చేశారు.