
సూర్య, చంద్రప్రభలపై కల్యాణ వెంకన్న
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామివారు విహరించారు. భక్తుల వేకువ జామున సుప్రభాత సేవ తో ఆలయాన్ని తెరచిన అర్చకులు నిత్యపూజా కార్యక్రమాలను పూర్తి చేసి, తొలి గంటతో దూప, దీప నైవేద్యాలను సమర్పించారు. 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై కల్యాణ వెంకన్నను త్రివిక్రముని అవతారంలో కొలువుదీర్చి, ఊరేగించారు. అనంతరం ఉత్సవర్లకు సుగంధ పరిమల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం బాల గోపాలుని అవతారంలో స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనానంలో కొలువుదీరి పురవీధుల్లో ఊరేగారు. ఈ కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయాధికారి నాగరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య, ఆర్జితం అధికారి భరత్ తదితరులు పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 7.45 గంటలకు స్వామి వారి రథోత్సవం ప్రారంభమవుతుందని ఆలయాధికారి నాగరాజు తెలిపారు. సాయంత్రం మాడవీధిలో క్షత్రియ వేషధారణలో స్వామివారు అశ్వవాహనంపై ఊరేగనున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆర్జిత కల్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆర్జిత కల్యాణంలో పాల్గొనే దంపతులు రూ.వెయ్యి చెల్లించి పాల్గొని, తీర్థ ప్రసాదాలను అందుకోవాలని నాగరాజు తెలిపారు.
శ్రీవారి రథానికి ముస్తాబు
ఉభయ దేవరులతో కలిసి కల్యాణ వేంకటేశ్వరస్వామి పురవీధుల్లో విహరించడానికి శ్రీవారి రథం ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామవారి రథోత్సవం జరుగుతుంది. వేకువజామున 2 గంటలకు మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీదేవీ, భూదేవీ సమేత కల్యాణ వెంకన్న రథం మండపానికి చేరుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య తెలిపారు. రథం 7.45 నిమిషాలకు కదులుతుందన్నారు. సుమారు 60 అడుగుల ఎత్తైన చెక్క రథం నగరవీధి, ట్రంకురోడ్డు, మట్లవారి వీధి, కోమిటి బజారు వీధి మీదుగా గంగుండ్రమండపానికి రథోత్సవం చేరుకుంటుంది. అయితే రథోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఆపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ జయప్రకాష్ తెలిపారు.

సూర్య, చంద్రప్రభలపై కల్యాణ వెంకన్న