
రేషన్ దుకాణం ముట్టడి
తిరువళ్లూరు: రేషన్ దుకాణంలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ 86–వేపంబట్టు గ్రామానికి చెందిన ప్రజలు దుకాణాన్ని ముట్టడించారు. 86–వేపంబట్టులోని దుకాణం ద్వారా 1,500 మంది కార్డుదారులకు సరుకులను అందజేయాల్సి ఉండగా, మూడు నెలల నుంచి బయోమెట్రిక్ సరిగ్గా పని చేయడం లేదని తిప్పి పంపడం, తరువాత గడువు ముగిసిందని చెప్పి సరుకులు ఇవ్వడానికి నిరాకరిచడంతో ఆగ్రహించిన స్థానికులు శనివారం ఉదయం రేషన్ దుకాణాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అందించే సరుకులను సిబ్బంది సరిగ్గా అందించడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. భవిషత్తులో సరుకుల పంపిణీకి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.