
బిస్కెట్ ప్యాకెట్‌లో గంజాయి సరఫరాకు యత్నం
● యువకుడి అరెస్టు
అన్నానగర్: సేలం సెంట్రల్ జైలులో ఒక ఖైదీని చూడడానికి వచ్చిన ఒక యువకుడు బిస్కెట్ ప్యాకెట్‌లో గంజాయిని తీసుకువచ్చి పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వెల్లూరు జిల్లాలోని మేట్టూరుకు చెందిన కవియరసు (27) సేలం సెంట్రల్ జైలులో ఉన్నాడు. అతనిపై దోపిడీ, చోరీ సహా పలు కేసులున్నాయి. బెయిల్ పై బయటకు వచ్చిన జైలులో అతని భాగస్వామి అయిన ధర్మపురికి చెందిన మహ్మద్ సుగిల్ (30), కవియరసును కలవడానికి శనివారం సేలం జైలుకు వచ్చాడు. అక్కడే ఉన్న కవియరసు ఇంటర్ కామ్‌లో మాట్లాడాడు. అప్పుడు మహమ్మద్ సుగిల్ తాను తెచ్చుకున్న రెండు బిస్కెట్ ప్యాకెట్లపై తన పేరు రాశాడు. వాటిని స్కాన్ చేయగా, బిస్కెట్ ప్యాకెట్‌పై అనుమానాస్పద లేఖ కనిపించింది. జైలు వార్డెన్లు వెంటనే మహమ్మద్ సుగిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను తన ముందున్న బ్యాగ్ తెరిచినప్పుడు బిస్కెట్ ప్యాకెట్ మధ్యలో 4 ప్యాకెట్లలో 80 గ్రాముల గంజాయిని దాచిపెట్టినట్లు వెల్లడైంది. దీంతో జైలు అధికారులు మహమ్మద్ సుగిల్‌ను అరెస్టు చేసి, అస్తంబట్టి పోలీసులకు అప్పగించారు. ఖైదీ కవియరసుపై కూడా ఫిర్యాదు నమోదైంది.