
ఐదేళ్ల బంగ్లాదేశ్ బాలికకు అరుదైన శస్త్రచికిత్స
కొరుక్కుపేట: ఊబకాయం సమస్యతో అధికబరువు పెరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఓ 5 ఏళ్ల బంగ్లాదేశ్ చిన్నారికి చైన్నెలోని లైఫ్‌లైన్ ఆస్పత్రి వైద్యులు అరుదైన బేరియాట్రిక్ సర్జరీని చేసి, పునర్జన్మను ప్రసాదించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లైఫ్‌లైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ అడ్వాన్సుడ్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిరుధ్ రాజ్‌కుమార్, చైర్మెన్ అండ్ చీఫ్ సర్జన్ డాక్టర్ జేఎస్ రాజ్‌కుమార్ మాట్లాడారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఐదేళ్ల బాలిక ప్రాడర్ –విల్లీ సిండ్రోమ్‌తో బాదపడుతూ ఆస్పత్రికి వచ్చిందన్నారు. ఊబకాయం కారణంగా నడవలేకపోవడంతోపాటు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయిందని, అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం ప్రారంభదశలో ఉన్న కొవ్వుకాలేయవ్యాధితో పోరాడుతుందని తెలిపారు. తగిన పరీక్షలు నిర్వహించిన అనంతరం దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా హైరిస్క్ బేరియాట్రిక్ విధానంతో సర్జరీని విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి సాధారణంగా నడవగలగడంతోపాటు దాదాపు 8 కిలోల బరువు తగ్గిపోయిందని, మరో ఆరునెలల్లో 10నుంచి 15 కిలోలు బరువు తగ్గుతుందని తెలిపారు.