
2026లోనే కాదు 2031లోనూ అధికారం మాదే!
– సీఎం స్టాలిన్ ధీమా
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, 2031, 2036లోనూ డీఎంకే అధికారంలోకి వస్తుందని సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ ఊటీలో ఐదు రోజులు పర్యటించారు. చివరి రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం అక్కడి పార్కులో ఎంపీ రాజాతో కలిసి ఆయన వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఐదు రోజులు ఇక్కడే ఉన్నానని గుర్తు చేస్తూ, ఈ పర్యటన ఎంతో ఆనందకరంగా ఉందని పేర్కొన్నారు. నీలగిరి ప్రజలే కాదు, ఇక్కడకు వచ్చిన పర్యాటకులు సైతం తనను చూసేందుకు వచ్చారని, వారి మద్దతును తెలుపుతున్నారని చెప్పారు. గవర్నర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడం గురించి ఇప్పటికే తాను స్పష్టత ఇచ్చానన్నారు. ఇక, ఇతర బీజేపీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య పార్టీల నేతలతో చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నిరంకుశ విధానాన్ని అనుసరిస్తున్నదని మండిపడ్డారు. 2026లో ద్రావిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఆ తర్వాత జరిగే 2031, 2036లోనూ అధికారి తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆ మేరకు ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. కాగా, ఊటీ పర్యటనకు వచ్చిన సీఎంను చూసేందుకు శుక్రవారం కూడా జనం ఎగబడ్డారు. నీలగిరుల్లోని అటవీ గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు, కొన్ని సంఘాల ప్రతినిధులు సీఎంను కలిసి తమ సంప్రదాయం మేరకు సత్కరించారు.