
ఇది కదా లక్కు అంటే!
తమిళసినిమా: రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే అందే అంతస్తే వేరుగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్‌ది ఇదే పరిస్థితి. ఈ జాన మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్‌హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ.కోటి పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్‌గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా ఽశింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్‌తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్‌నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అదే సమయంలో టాలీవుడ్‌లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్‌తో ఇప్పుడు కోలీవుడ్‌లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే.
కయ్యదు లోహర్