
రమణ–2 చేద్దాం రండి!
తమిళసినిమా: దివంగత నటుడు, రాజకీయనాయకుడు విజయ్‌కాంత్‌ను అందరూ అభిమానంతో కెప్టెన్ అని పిలిచేవారు. ఈయన సినిమాల్లో నటిస్తున్నప్పుడే దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించేవారు. చిత్ర పరిశ్రమలో ఎందరికో సాయాన్ని అందించారు. అలాంటి విజయకాంత్‌కు విజయ్‌ప్రభాకర్, షణ్మగపాండియన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. వారిలో విజయ్‌ప్రభాకర్ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించగా, రెండో కుమారుడు షణ్ముగ పాండియన్ సినీ రంగప్రవేశం చేశారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం పడైతలైవన్. ఈ చిత్రానికి అన్బు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 23న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత, ఎల్.సుదీశ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, శశికుమార్, పొన్‌రామ్ పాల్గొ న్నారు. మురుగదాస్ మాట్లాడుతూ విజయ్‌కాంత్ హీరోగా తాను తెరకెక్కించిన రమణ చిత్రానికి ముందే ఆయనతో తనకు పరిచయం ఉందన్నారు. ఆయన నటించేటప్పుడు రెండు టేక్‌ల కంటే ఎక్కవ ఎప్పుడూ తీసుకోలేదన్నారు. కాగా విజయ్‌కాంత్ వారసుడు షణ్ముగ పాండియన్ నటించిన పడైతలైవన్ చిత్రాన్ని సక్సెస్ చేయడానికి ఆయన అభిమానులమైన మనం అంతా ముందుకు రావాలన్నారు. తాను విజయ్‌కాంత్ కళ్లను షణ్ముగపాండియన్‌లో చూస్తున్నాననీ, రమణ–2 చిత్రం చేద్దాం ఎదిగి రండి అంటూ మురుగదాస్ షణ్ముగపాండియన్‌తో అన్నారు. అందుకు ఓకే అని షణ్ముగపాండియన్ చెప్పారు. వేదికపై ఉన్న సుదీశ్ రమణ–2 చిత్రాన్ని నిర్మించడానికి తాను రెడీ అని చెప్పారు. కాగా మనుషులకై నా, జీవాలకై నా ప్రాణం ఒక్కటే అనే సందేశంతో కూడిన పడైతలైవన్ చిత్రంలో ఏనుగు ప్రధాన పాత్రను పోషించడం విశేషం. కాగా ఈ యన తర్వాత పొన్‌రామ్ దర్శకత్వంలో కొంబు సీవి అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు శశికుమార్ దర్శకత్వంలో కుట్రపరంపరై అనే వెబ్‌సీరీస్‌లోనూ నటించనున్నారు.

రమణ–2 చేద్దాం రండి!