
డీఎంకేలో డివిజన్ల వారీగా ఇన్‌చార్జ్‌లు
● రంగంలోకి ముఖ్య నేతలు ● ఇక ఎన్నికల పనుల వేగం
సాక్షి,చైన్నె: డీఎంకేలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయడం లక్ష్యంగా డివిజన్ల వారీగా ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగనున్నారు. ఏడుగురు నేతల్ని డివిజన్ల వారీగా నియమించేందుకు కసరత్తులు పూర్తి చేశారు. మళ్లీ అధికారంలో లక్ష్యంగా ద్రావిడ మోడల్ సీఎం ఎంకే స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. డీఎంకే యువజన విభాగం ఓ వైపు, పార్టీ అనుబంధ విభాగాలు మరో వైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాయి. జిల్లాలు, యూ నియన్లు, పట్టణాలు, నగరాలు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం చేయించడమే కాకుండా, ప్రజల్లోకి చొచ్చుకేళ్లే కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలన్నీ ఇంటింటా దరి చేరాయా అని పరిశీలించి అర్హులైన వారికి మరిన్ని పథకాలను దరి చేర్చే దిశగా కసరత్తులు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ఏడు డివిజన్లుగా పార్టీ పరంగా విభజించారు. ఆయా డివిజన్లకు ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించనున్నారు. జిల్లాల కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల ద్వారా వీరు పనుల వేగాన్ని పెంచనున్నారు.
ఇన్‌చార్జ్‌లుగా.. : పార్టీ వర్గాల సమాచారం మేరకు తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుతురై జిల్లాలను ఏకం చేస్తూ ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. దీనికి ఇన్‌చార్జ్‌గా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, మంత్రి కేఎన్ నెహ్రూను నియమించనున్నారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధికి దక్షిణ తమిళనాడులోని ఓ భాగానికి ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించనున్నా రు. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, కన్యా కుమారి జిల్లాల్లో ఆమె పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇక, చైన్నె డివిజన్‌లోని చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలతో కూడిన డివిజన్‌కు ఎంపీ రాజాను ఇన్‌చార్జ్‌గా నియమించనున్నారు. రామనాథపురం, విరుదునగర్, శివగంగై జిల్లాల డివిజన్ ఇన్‌చార్జ్‌గా మంత్రి తంగం తెన్నరసు, తిరువణ్నామలై, వేలూరు, విల్లుపురం జిల్లా లతో కూడిన డివిజన్ బాధ్యతలు మంత్రి ఏవీ వేలుకు అప్పగించనున్నారు.
కొంగు మండలం సెంథిల్‌కు..
మదురై, దిండుగల్, తేని జిల్లాలతో కూడిన డివిజన్‌కు మంత్రి చక్రపాణి ఇన్‌చార్జ్‌గా ఉండబోతున్నారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కొంగు మండలం ఇన్‌చార్జ్ పగ్గాలు అప్పగించనున్నారు. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, కరూర్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు ఆయన గుప్పెట్లోకి తీసుకు రాబోతున్నారు. జూన్ 1న మదురైలో జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ఈ ఇన్‌చార్జ్‌ల ప్రకటన వెలువడనున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో 1,244 బహిరంగ సభల నిర్వహణతోపాటు ఇతర కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేశారు.