
కొడనాడు కేసులో దోషులను శిక్షించాలి
సాక్షి, చైన్నె : కొడనాడు హత్య, దోపిడీ కేసులో దోషులు శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో హాట్ టాఫిక్‌గా మారాయి. అన్నాడీఎంకే హయాంలో దివంగత సీఎం జె. జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన, హత్య, దోపిడీ గురించి తెలిసిందే. ఈ కేసులో నిందితులు అరెస్టయినా, అన్నాడీఎంకే పెద్ద చుట్టూ, మాజీ పెద్దల చుట్టూ విచారణ సాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో బుధవారం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో నిందితులకు పడ్డ శిక్షను గుర్తు చేస్తూ, కొడనాడు కేసులో నిందితులకు ఇదే తరహా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తిరుచ్చిలో మీడియాతో మాట్లాడుతూ, కొడనాడు కేసును ప్రస్తావించారు. పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో బాధితులకు న్యాయంజరిగిందని పేర్కొంటూ, కొడనాడు కేసులోనూ దోషులు శిక్షించ బడాలని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమకు వ్యతిరేకంగా డీఎంకే పాలకులు ఈకేసును అస్త్రంగా చేసుకుని వ్యూహాలకు పదును పెట్టి ఉన్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు సైతం కేసులో దోషులు శిక్షించ బడాలని వ్యాఖ్యలు చేయడాన్ని అన్నాడీఎంకే వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.