
పక్షిరాజుపై పరంధాముడు
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి పక్షి రాజైన గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మోహినీ అవతారంలో పల్లకిలో భక్తుల హారతులందుకున్నారు. వేకువ జామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరచి నిత్యపూజ, హోమశాలలో ప్రత్యేక పూజలు, తొలి గంట, దూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని మోహినీ అవతారంలో పల్లకిలో కొలువుదీర్చారు. భక్తులు స్వామివారిని తిలకించి కర్పూర హారతులిచ్చి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించిన గ్రామ వీధుల్లో ఊరేగారు. రాత్రి 11 గంటలకు ఆస్థానం, శుద్ధి తదితర కార్యక్రమాలను పూర్తి చేసి, స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవలు జరగనున్నాయి.