
పుష్పపల్లకీలో ద్రౌపదమ్మ విహారం
● అలరించిన ‘అర్జున తపస్మాన్’
గుడుపల్లె: మండలంలో యామగానిపల్లెలోని శ్రీ ద్రౌపదీ ధర్మరాజుల మహా భారత ఉత్సవాల్లో 14వ రోజు గురువారం ద్రౌపది అమ్మవారి పుష్పపల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. తొలుత ఉదయం ఆలయం వద్ద అర్జున తపస్మాన్ కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. కౌరవులతో యుద్ధంలో గెలవడానికి అర్జునుడు శివుని నుంచి పాశుపతాస్త్రం శివుని పొందడానికి తపస్మాన్ అధిరోహిస్తాడని భారతగాథ. బుధవారం రాత్రి అరణ్యపర్వం నాటక ప్రదర్శన అనంతరం ఉదయాన అర్జున వేషధారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం తపస్సు మానుకు ప్రత్యేక పూజలు చేసి, నిమ్మకాయలు, పూజాసామగ్రిని తీసుకుని అధిరోహించాడు. అక్కడ నుంచి విసిరిన నిమ్మకాయలు, విభూది ఉండలు, ఇతరత్రా వాటిని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఆ తర్వాత మొక్కులు చెల్లించారు. అనంతరం రాత్రి ఆలయంలో ద్రౌపదమ్మను ప్రత్యేకంగా అలంకరించి పుష్పపల్లకిలో మంగళవాయిద్యాలు, బాణ సంచా మోత నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. ఆ తర్వాత శ్రీకృష్ణార్జునుని యుద్ధం పౌరాణిక నాటకం ప్రదర్శించారు. భక్తులకు అన్నదానం చేశారు.