
ఒంటరి ఏనుగు హల్‌చల్
హడలిపోతున్న గ్రామస్తులు
గుడుపల్లె: ఒంటరి ఏనుగు రోడ్డుపై హల్‌చల్ చేసింది. ఈ సంఘటన మండలంలోని సంగనపల్లె నుంచి తమిళనాడులోని వేపనపల్లెకు వెళ్లే రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సంగనపల్లె, చిన్నపర్తికుంట, పెద్దపిర్తకుంట గ్రామాల సమీపంలోని ఉన్న రోడ్డుపై ఒంటరి ఏనుగు సంచరించింది. నడి రోడ్డుపై ఏనుగు ఉండడంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, మోటార్ సైక్లిస్టులు హడలిపోయారు. ఈ రోడ్డులో నిత్యం ద్విచక్రవాహనాలలో రాకపోకలు సాగిస్తూంటారు. గ్రామాలకు సమీపంలోనే అటవీ ప్రాంతం ఉండడం, దీనికి ఆనుకుని సాగు చేసిన పంటలు ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి రాత్రి పూట వెలుపలికి వచ్చేందుకు జంకుతున్నారు. అటవీ శాఖ అదికారులు స్పందించి ఒంటరి ఏనుగు గ్రామాల వైపు రాకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు.